హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారు అయింది. అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘంగా అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. తుది నిర్ణయం కోసం.. బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ భన్సల్ రెండు రోజుల కిందట హైదరాబాద్ వచ్చారు. పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపి చివరికి ఈటల వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని .. అందరితో సంప్రదింపులు జరిపారు.

ప్రధాని మోడీ ఈటలకు ప్రత్యేకంగా అపాయింట్ మెంట్
ప్రధానమంత్రి నరేంద్రమోడని ఈటల రాజేందర్ కుటుంబంతో సహా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ ఈటలకు ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ ఇవ్వడం కూడా ఆయనకే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఖరారయిందనడానికి సంకేతంగా బీజేపీ వర్గాలు అంచనాకు వస్తున్నాయి. నిజానికి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈటల రాజేందర్ కు ఈ పదవి ప్రకటిస్తారని అనుకున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. కిషన్ రెడ్డి గత రెండేళ్లుగా అటు కేంద్ర మంత్రిగా.. ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

అరుణ కూడా మహిళా కోటాలో అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం
కేంద్ర మంత్రివర్గంలో ఈటలకు చోటు లభించకపోవడంతో ఆయనకే చీఫ్ పదవి వస్తుందని అనుకున్నారు. కానీ ఆయనకు వ్యతిరేక వర్గం కూడడా బలంగానే ఉందని.. పార్టీలో కింది స్థాయి నుంచి ముఖ్యంగా ఆరెస్సెస్ నేపధ్యం ఉన్న వారికే ప్రాధాన్యం కల్పించాలన్న ఒత్తిడి హైకమాండ్ పై చేశారన్న ప్రచారం జరిగింది. బండి సంజయ్ కూడా అవసరం అయితే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. తెలంగాణ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలు పంపినట్లుగా చెబుతున్నారు. అలాగే డీకే అరుణ కూడా మహిళా కోటాలో అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించారు.
వచ్చే ఎన్నికల వరకూ అధ్యక్షుడిగా
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ సీఎం నినాదాన్ని ప్రధాని మోదీ వినిపించారు. ఈటల రాజేందర్ ను దృష్టిలో పెట్టుకునే అ ప్రకటన చేశారన్న ప్రచారం జరిగింది. కానీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇప్పుడు టీ బీజేపీ చీఫ్ గా నియమితులయ్యే వ్యక్తి వచ్చే ఎన్నికల వరకూ అధ్యక్షుడిగా ఉంటారు. తెలంగాణలో అంతకంతకూ బీజేపీ బలపడుతున్న దశలో అధ్యక్షుడిగా ఉండటం వల్ల.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. సీఎం అయ్యే చాన్స్ కూడా రాష్ట్రంలో పార్టీని నడిపించిన నేతకే వస్తుంది. అందుకే ఈ సారి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువగా ఉంది. చివరికి ఈ పోటీలో ఈటల రాజేందర్ విజయం సాధిస్తున్నారని అనుకోవచ్చు.