అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన వలస విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం, హోటళ్లు, రెస్టారెంట్ల వంటి కీలక పరిశ్రమలపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐస్) అధికారులు నిర్వహిస్తున్న వలసదారులపై దాడులు, అరెస్టులను తక్షణమే నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. ఈ మార్పు ట్రంప్ (Donald Trump) రాజకీయ ప్రాధాన్యత కలిగిన కొన్ని నియోజకవర్గాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయంగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అనధికార వలసదారులపై సాగుతున్న సామూహిక బహిష్కరణ ప్రచారాన్ని కొంతవరకూ పక్కనబెట్టి, ఆర్థికపరంగా కీలకమైన రంగాలను రక్షించే దిశగా ఈ మార్పు జరిగింది.
ఈ చర్యలపై ఐస్ సీనియర్ అధికారి టాటమ్ కింగ్ ఆ శాఖ ప్రాంతీయ నాయకులకు ఈ మేరకు ఒక ఈమెయిల్ పంపినట్టు సమాచారం. “ఈ రోజు నుంచి వ్యవసాయం (ఆక్వాకల్చర్, మాంసం ప్యాకింగ్ ప్లాంట్లతో సహా), రెస్టారెంట్లు, నడుస్తున్న హోటళ్లపై వర్క్‌సైట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులు/ఆపరేషన్లను నిలిపివేయండి” అని ఆ సందేశంలో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, ఈ పరిశ్రమల్లోకి జరిగే “మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్, డ్రగ్ స్మగ్లింగ్” వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన దర్యాప్తులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఎలాంటి నేరచరిత్ర, పత్రాలు లేని వలసదారులను (“నాన్‌క్రిమినల్ కొల్లేటరల్స్”) కస్టడీలోకి తీసుకోవద్దని కూడా ఏజెంట్లను ఆదేశించినట్టు సమాచారం.

విపరీతమైన నిరసనలు, ఉద్రిక్తతల మధ్య ట్రంప్ వెనక్కి అడుగు
ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐస్) అధికారులు, ఇతర ఫెడరల్ ఏజెన్సీలు జరిపిన దాడుల అనంతరం తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ వారం ప్రారంభంలో, లాస్ ఏంజెలెస్‌కు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంటా అనాలో వలస దాడులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన హింసాత్మకంగా మారి పలువురు గాయపడగా, కొందరిని అరెస్ట్ చేశారు. ఆరెంజ్ కౌంటీ రాజధాని అయిన శాంటా అనాలో ఐస్ అధికారులు ఆ రోజు జరిపిన దాడులే ఈ నిరసనలకు కారణమయ్యాయి. ఇక్కడ 3 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థలో వలసదారుల పాత్ర కీలకం
అధికారులు రోజువారీ కూలీలను లక్ష్యంగా చేసుకున్నట్టు కనబడుతోందని ఆరెంజ్ కౌంటీ సూపర్‌వైజర్ విసెంటె సర్మియెంటో ‘ఆరెంజ్ కౌంటీ రిజిస్టర్’ వార్తాపత్రికకు తెలిపారు. సుమారు 200 మంది నిరసనకారులు జెండాలు ఊపుతూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంటా అనా నగరంలోని ఫెడరల్ భవనం వెలుపల గుమిగూడారు. ఈ భవనంలోనే ఐస్ కార్యాలయాలు, ఇతర ఫెడరల్ విభాగాల ఆఫీసులు ఉన్నాయి. ఆ తర్వాత, పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపినట్టు ఆరోపణలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Read also: Ruyangsurak: విమాన ప్రమాదాల్లో బయటపడిన ఇద్దరిదీ ఒకే సీట్ నంబర్!