జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల వేడిలో రాజకీయ నేతల హడావిడి రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి (Election Code of Conduct) ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేర్లతో పాటు, ఎమ్మెల్సీ శంకర్ పేరుతోనూ మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచార చర్యలు, పోలింగ్ రోజున వారి హాజరు నేపథ్యంలో నమోదు కావడం గమనార్హం.
ఎన్నికల సంఘం (Election Commission) ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ కేంద్రాల వద్ద తిరగరాదు, ఓటర్లను ప్రభావితం చేయరాదు అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, వీరు వాటిని బేఖాతరు చేశారని ఆరోపణలు ఉన్నాయి. పోలింగ్ రోజున బీర్ల ఐలయ్య, మాలోత్ రాందాస్, రామచంద్ర నాయక్‌లు, శంకర్ కలిసి బూత్‌ల వద్ద చక్కర్లు కొట్టడం, ఓటర్లతో మాట్లాడడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా భావిస్తున్నారు. రహమత్‌నగర్ డివిజన్‌లోని ఎస్‌డీపీ హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్‌చల్ చేయడం, వెంగళరావునగర్ బూత్ వద్ద మట్టా దయానంద్ హాజరుకావడం కూడా ఆ నియమావళి విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ నేతలు ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ కేసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వాతావరణాన్ని మరింత రాజకీయరంగులోకి నెట్టాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా, ఈ కోడ్ ఉల్లంఘన కేసులు పార్టీకి తలనొప్పిగా మారాయి. మరోవైపు బీఆర్‌ఎస్ నేతలు “నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి” అంటూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/