అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Plane Crash)పై విచారణ జరుగుతోంది. ప్రమాదానికి కారణంగా ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్‌లు ఆకస్మాత్తుగా కట్‌ఆఫ్ కావడమే అని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పేర్కొంది. ఫ్యూయెల్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో యంత్రాలు పని చేయకపోవడంతో విమానం ప్రమాదానికి గురైందని తేలింది. ఈ నేపథ్యంలో విమానాల్లో ఫ్యూయెల్ కంట్రోల్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభమయ్యాయి.
డీజీసీఏ ఆదేశాలు – అన్ని విమానాల్లో తనిఖీలు
ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక కీలక ఆదేశాన్ని జారీ చేసింది. జూలై 21వ తేదీ లోగా దేశంలో ఉన్న బోయింగ్ 787, 737 మోడల్ విమానాలను పూర్తిగా తనిఖీ చేయాలని సూచించింది. ప్రత్యేకంగా ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజం పనిచేస్తున్నదో లేదో పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. ప్రమాదం ప్రమాదంగా మిగిలిపోకుండా ముందు జాగ్రత్త చర్యలతో భద్రతను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
బోయింగ్ 787-8లో సమస్య లేదు – ఎయిర్ ఇండియా వివరణ
ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా స్పందించింది. తమ వద్ద ఉపయోగంలో ఉన్న బోయింగ్ 787-8 విమానాల్లో ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్‌ల లాకింగ్ మెకానిజంలో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయని, ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపింది. ప్రయాణికుల భద్రతే తమకు ప్రధానం అని ఎయిర్ ఇండియా స్పష్టం చేస్తోంది. DGCA ఆదేశాల మేరకు తనిఖీలు కొనసాగుతున్నాయని, ఏవైనా లోపాలు గుర్తించినట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటామని సంస్థ పేర్కొంది.
Read Also : Kaleswaram : కాళేశ్వరం ఇంజినీర్ల అవినీతిపై ఈడీ ఫోకస్