తెలంగాణలో ఇంటర్ కాలేజీల్లో (Telangana Inter College ) బోధన నాణ్యతను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 494 మంది గెస్టు లెక్చరర్ల నియామకానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. త్వరలోనే నియామక ప్రక్రియను పూర్తి చేసి, ఈ విద్యా సంవత్సరంలోనే వారిని కాలేజీల్లో నియమించనున్నట్లు తెలిపారు. దీని వలన విద్యార్థులకు అవసరమైన అధ్యాపక బలం అందుబాటులోకి రానుంది.
ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మార్పులు లేవు
ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో (Inter-practical exams) జంబ్లింగ్ విధానం అమలు చేయబోమని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అనవసర ఆందోళన చెందవద్దని అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయకుండా పాత విధానాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.

సీసీ కెమెరాల ఏర్పాటు
ప్రాక్టికల్ పరీక్షలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగేందుకు ప్రభుత్వ కాలేజీలతో పాటు ప్రైవేట్ కాలేజీల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించనున్నట్లు చెప్పారు. విద్యార్థుల ప్రతిభను కచ్చితంగా అంచనా వేయడమే తమ లక్ష్యమని బోర్డు సెక్రటరీ పేర్కొన్నారు. ఈ చర్యలతో పరీక్షల విశ్వసనీయత మరింతగా పెరగనుంది.