వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ (Vijaykumar) గారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త వేసేవారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై చెత్త వేసేవారిని ఇకపై నేరస్థులుగా పరిగణిస్తూ, వారికి జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై చెత్త వేసిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రైవ్ వల్ల రోడ్ల పరిశుభ్రత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ ఐదుగురిపై ఛార్జిషీటు దాఖలు చేసి, వారిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. రోడ్లపై చెత్త (Garbage ) వేయడం అనేది చట్ట ప్రకారం నేరమని, దాని వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలుగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయమూర్తి తీర్పునిస్తూ ఆ ఐదుగురికి 8 రోజుల జైలు శిక్ష విధించారు. ఈ శిక్ష వల్ల ప్రజలలో మార్పు వస్తుందని, రోడ్లపై చెత్త వేయడం మానేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రత్యేక డ్రైవ్ హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను రోడ్లపై వేయకుండా, మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన చెత్త డబ్బాల్లోనే వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్లపై చెత్త వేయడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా నేరాలకు పాల్పడినవారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.