వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే ప్రజల్లో సానుభూతి వస్తుందన్న భావన అసత్యమని స్పష్టం చేశారు. “జగన్ అరెస్టు అయినా, బెయిల్ రద్దయినా ప్రజలు మద్దతు ఇస్తారన్నది అపోహే. అరవింద్ కేజ్రీవాల్ వంటి నేత జైలు వెళ్లి వచ్చాక పార్టీ పరిస్థితి ఎలా మారిందో అందరికీ తెలుసు” అని ఆయన గుర్తుచేశారు.
మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని (Kodalinani , Vamshi) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు వారు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. “వంశీ ఆరోగ్యం దెబ్బతిని నరకం అనుభవిస్తున్నారు. నాని గుండె నొప్పితో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అసభ్యంగా మాట్లాడిన వారిపై ప్రజలకు సానుభూతి ఉండదు. ఇది దేవుడి స్క్రిప్ట్” అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో తమ పార్టీ నాయకులు చేసిన దుష్ప్రచారాల వల్ల వైసీపీకే నష్టం జరిగిందని, టీడీపీకే లాభం జరిగిందని తెలిపారు.
జగన్, సజ్జల వ్యవహారశైలి మీద ఆరోపణలు
జగన్ ప్రోత్సాహంతోనే పలువురు నేతలు అసభ్యంగా మాట్లాడారని, పార్టీ ఆఫీసు నుంచి స్క్రిప్ట్ వచ్చేదని కోటంరెడ్డి ఆరోపించారు. “హుందాగా మాట్లాడితే భవిష్యత్తు ఉండదని, దూషించాలి, దాడి చేయాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేవారు” అని వెల్లడించారు.
Read Also : Notice : కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు