చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ హైకోర్టును తప్పుదోవ పట్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి మధ్యంతర బెయిలు పొందిన విషయం తాజాగా బయటపడింది.
మధ్యంతర బెయిలు
అనంతపురంలో నమోదైన కేసులో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ.. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసేందుకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరుతూ గత నెల 14న హైకోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టు దీనిని పరిగణలోకి తీసుకుని, ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఈ గడువు ముగిసిన తర్వాత 28న సాయంత్రం అతడు తిరిగి లొంగిపోయాడు.మార్చి 1న బోరుగడ్డ హైకోర్టులో మరో పిటిషన్ వేస్తూ మధ్యంతర బెయిలును పొడిగించాలని అభ్యర్థించాడు. తల్లికి తాను ఒక్కడినే కుమారుడినని, ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, మరో రెండు వారాల పాటు చికిత్స అవసరమని పేర్కొన్నాడు. గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ ఇచ్చినట్టుగా ఒక మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాడు.
మెడికల్ సర్టిఫికెట్
పోలీసుల తరపున వాదనలు వినిపించిన ఏపీపీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ వాస్తవమా కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. తప్పుడు ధ్రువీకరణ పత్రం అయితే చర్యలు తప్పవని హెచ్చరించుతూ, మార్చి 11 వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.

పోలీసుల విచారణ
పోలీసుల విచారణలో బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదని తేలింది. పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందడం నిజమే అయినా, ఆమె ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయినట్టు గుర్తించారు. దీంతో లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా, వారు అలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని, పద్మావతి తమ వద్ద చికిత్స పొందలేదని తెలిపారు. ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ కూడా తాము అలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
న్యాయస్థానం
తప్పుడు సర్టిఫికెట్‌తో కోర్టును మోసగించిన అనిల్ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయనపై మరో కేసు నమోదు చేయాలని యోచిస్తున్నారు. కాగా, తప్పుడు సర్టిఫికెట్‌తో కోర్టును మోసగించిన బోరుగడ్డ ఎక్కడ ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.