ఏప్రిల్ చివరి నాటికి భారతీయ జనతాపార్టీకి నూతన జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కానున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. రానున్న వారం రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా మిగిలిన రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను ప్రకటించనున్నట్లు సదరు వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు
పార్టీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 19 రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ప్రకటించిన తర్వాత.. పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడి కోసం ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే, ఇప్పటికే 13 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించిన అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. అది ఈ నెల చివరినాటికి పూర్తవుతుందని సమాచారం. ఏప్రిల్ చివరికి జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు
కాగా, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్న విషయం తెలిసిందే. 2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇటీవలే కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారింలోకి వచ్చిన తర్వాత నడ్డాను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడితోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. ఇక పార్టీ చీఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలే. దీంతో ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది.