మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెలిందా ఫ్రెంచ్ గేట్స్‌ల విడాకుల వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. 2021లో వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల డివోర్స్ విషయంపై బిల్ గేట్స్ స్పందిస్తూ.. విడాకులు తీసుకోవడం నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు. దానికి పశ్చత్తాపం చెందుతున్నా అని ఎమోషనల్ అయ్యారు. అయితే తాజాగా బిల్ గేట్స్ వ్యాఖ్యలపై మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ స్పందించారు. ఇటీవల ఎల్లే మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు.

చాలా బాధాకరమైన అంశం
” విడాకులు అనేది చాలా బాధాకరమైన అంశం. ఇలాంటివి ఏ కుటుంబంలోనూ జరగకూడదని నేను కోరుకుంటా. డివోర్స్ తర్వాత నేను స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకున్నా. విడాకుల సమయంలో భయమేసినా.. స్వతంత్రంగా జీవించగలనన్న ధైర్యం మాత్రం ఉండేది. అది చాలా ముఖ్యం అని చెప్పుకొచ్చారు.
2021లో విడాకులు తీసుకున్నారు
1994 లో బిల్‌గేట్స్, మెలిందా వివాహం చేసుకున్నారు. 27 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత వివిధ కారణాల వల్ల 2021లో విడాకులు తీసుకున్నారు. అయితే వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. డివోర్స్ అనంతరం ఓసారి బిల్ గేట్స్ మాట్లాడారు. ” విడాకుల విషయంలో మేము బాధపడ్డాం. మిలిందా నాకంటే ఎక్కువ రోజులు బాధపడొచ్చు.
మేము నా తల్లిదండ్రుల్లా 45 ఏళ్ల పాటు వివాహబంధంలో ఉండాలని కోరుకున్నాం. కానీ ఆ కల నెరవేరలేదు” అని చెప్పుకొచ్చాడు. ఇక బిల్ గేట్స్.. 62 ఏళ్ల పౌలా హర్డ్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ అప్పట్లో నెట్టింట్లో తెగ ప్రచారం జరిగింది. గతేడాది జరిగిన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో ఇద్దరూ జంటగా దర్శనమిచ్చారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ అంతా మాట్లాడుకుంటున్నారు.