దేశ ఆర్థిక రాజధాని ముంబయి అంటే గుర్తొచ్చే ప్రత్యేకమైన స్ట్రీట్ ఫుడ్ వడాపావ్. అయితే, ఈ ప్రత్యేకమైన వడాపావ్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇద్దరు దిగ్గజాలు కలిసి ఆస్వాదించడం నెట్టింట వైరల్‌గా మారింది. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత పర్యటనలో భాగంగా భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను కలిసి ఈ ముంబయి ప్రత్యేకతను ఆస్వాదించారు.

బిల్ గేట్స్ – సచిన్ టెండూల్కర్ వడాపావ్ తినే వీడియో వైరల్
తాజాగా బిల్ గేట్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పంచుకున్నారు, ఇందులో తనతో పాటు సచిన్ టెండూల్కర్ వడాపావ్ తింటూ కనిపించారు. పనిలోకి వెళ్లే ముందు చిన్న స్నాక్ బ్రేక్ అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు, వీడియోకు సర్వింగ్ వెరీ సూన్ అనే క్యాప్షన్ కూడా జోడించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆ ఇద్దరూ వడాపావ్‌ను ఆస్వాదిస్తున్న విధానం చూసి ఎంతో ఆనందిస్తున్నారు. ఈ వీడియోకు టీమిండియా మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ లాంటి స్టార్లు లైక్ చేయడం విశేషం. నెటిజన్లు కూడా బిల్ గేట్స్ వడాపావ్‌ను ఇష్టపడతారా? అంటూ చర్చించుకుంటున్నారు.
భారత పర్యటనలో బిల్ గేట్స్
బిల్ గేట్స్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన దేశంలో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే పార్లమెంట్ సందర్శించారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో స్థానం ఉన్న బిల్ గేట్స్ గత మూడేళ్లలో ఇది మూడోసారి భారత పర్యటన. ఆయన భారతదేశంలో ఆరోగ్య, విద్య, సాంకేతిక రంగాలకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. సచిన్ టెండూల్కర్ భారతదేశం కోసం క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన లెజెండ్. మరోవైపు, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ద్వారా ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన వ్యక్తి. వీరిద్దరూ కలవడం, ముంబయిలోని ఫేమస్ ఫుడ్ అయిన వడాపావ్‌ను ఆస్వాదించడం అభిమానులకు ఒక ప్రత్యేకమైన క్షణం. ఈ వీడియో చూసిన నెటిజన్లు టెక్ దిగ్గజం & క్రికెట్ దిగ్గజం ఒకే ఫ్రేమ్‌లో, సచిన్ అంటే క్రికెట్ లెజెండ్, బిల్ గేట్స్ అంటే సాంకేతిక రంగంలో లెజెండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారతదేశానికి బిల్ గేట్స్ ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉన్నారు. గతంలో కూడా దేశంలో ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజీ అభివృద్ధికి భారీగా మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం కూడా ఆయన వివిధ ప్రభుత్వ అధికారులను కలిసి దేశ అభివృద్ధి కోసం సంభాషిస్తున్నారు.