న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది. దేశం మొత్తం గర్వించదగిన సందర్భం ఇది. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోంది. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగింది. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని రాష్ట్రపతి తెలిపారు.

న్యాయం, స్వేచ్చ, సమానత్వం. సోదరభావం ఎల్లప్పుడు మన నాగరిక వారసత్వంలో భాగాంగా ఉన్నాయని రాష్ట్రపతి తెలిపారు. దేశంలో జమిలి ఎన్నికలు పాలనలో స్థిరత్వాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. మహా కుంభమేళా మన నాగరికత వారసత్వ గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను మార్చుకున్నామని, ఈ ఏడాది కొత్త చట్టాలను రూపొందించి అమల్లోకి తెచ్చామని రాష్ట్రపతి తెలిపారు. ఇక భారత్ అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా ఎదగడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకున్నామని, వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.