ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం, రాష్ట్రానికి కావాల్సిన ఆదాయాన్ని సమీకరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రుణాలపై ఎక్కువగా ఆధారపడింది.ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది.
మూడు స్టాక్స్
వేల కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా కూటమి ప్రభుత్వం 5,750 కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది. దీనికి అవసరమైన అయిదు స్టాక్స్‌ను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలానికి పెట్టింది. ఇందులో ఒక స్టాక్ విలువ 1,400 కోట్ల రూపాయలు. మరొకటి 1,350 కోట్ల రూపాయల విలువ చేసేది. మిగిలిన మూడు స్టాక్స్ విలువ ఒక్కొక్కటి 1,000 కోట్ల రూపాయలు. ఈ నెల 3వ తేదీన అంటే గురువారం నాడు ఈ స్టాక్స్ వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట సాగుతుంది.
స్టాక్స్
కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది. ఈ స్టాక్స్ కాల వ్యవధి ఒకటి- 16, మరొకటి- 15, మిగిలిన మూడింటివి- 8, 9, 12 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు. నాన్ కాంపిటీటివ్ విధానంలో వాటిని కొనదలిచిన వారు గురువారం ఉదయం 10: 30 నుంచి 11 గంటల మధ్య తమ బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఏపీతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు తమ స్టాక్స్‌ను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలానికి పెట్టాయి. హిమాచల్ ప్రదేశ్- రూ. 900 కోట్లు, జమ్మూ కాశ్మీర్- రూ. 500 కోట్లు, మేఘాలయా- రూ. 350 కోట్లు, పంజాబ్- రూ. 3,300 కోట్లు, రాజస్థాన్- రూ. 1,000 కోట్ల రూపాయల మేర స్టాక్స్‌ను వేలానికి పెట్టాయి.

లెక్కలు
ఏపీలో ప్రభుత్వం చేసే అప్పుల గురించి రాజకీయంగా ఎప్పుడూ దుమారం రేగుతూనే ఉంటుంది.అయితే మధ్య మధ్యలో అధికార పార్టీలు అధికారిక లెక్కల్ని అనుకోకుండా బయటపెడుతూనే ఉంటాయి. దీంతో అప్పటివరకూ వారు చెప్పిన లెక్కలు తప్పని తేలిపోతుంటుంది. అలాంటిదే ఓ పరిణామం చోటు చేసుకుంది.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జగన్ సర్కార్ 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ విపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం తాము గతంలో టీడీపీ చేసిన అప్పు కంటే తక్కువే చేశామని చెప్పేది.
అప్పు వివరాలు
దీంతో జనంలోనూ గందరగోళం నెలకొనేది.అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ సర్కార్ వెళ్లిపోయే నాటికి ఎంత అప్పు ఉంది, తమ ప్రభుత్వం వచ్చాక చేసిన అప్పు వివరాన్ని బయటపెట్టింది.గతంలో టీడీపీ సర్కార్ గద్దె దిగే నాటికి అంటే 2018-19 నాటికి ప్రభుత్వానికి రూ.2,57,509 కోట్లు, కార్పొరేషన్లకు రూ.49 వేల కోట్ల అప్పులు ఉన్నాయని, అలాగే వైసీపీ సర్కార్ గద్దెదిగే నాటికి అంటే 2024 జూన్ 12 నాటికి ప్రభుత్వరంగ సంస్థల అప్పులు రూ.9,74,556 కోట్లు చేసినట్లు తెలిపాయి.