ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో భాగంగా,సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు(Play Off Race) నుంచి తప్పుకుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేదు. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో 2 పాయింట్స్‌ను ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పోతు పోతు లక్నోను కూడా తమ వెంట తీసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), ఎయిడెన్ మార్క్‌రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45) దూకుడుగా ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/28) రెండు వికెట్లు తీయగా హర్ష్ దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డిలు తలో వికెట్ తీసారు.అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించగా ఇషాన్ కిషన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), హెన్రీచ్ క్లాసెన్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), కామిందు మెండీస్(21 బంతుల్లో 3 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రతి(2/37) రెండు వికెట్లు తీయగా విల్ ఓ రూర్కీ, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీసారు.
సెలెబ్రేషన్స్
కాగా, ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో గొడవ పడినందుకు దిగ్వేష్ రతి కఠినమైన శిక్షను ఎదుర్కొన్నాడు. దిగ్వేష్ రతిపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడలేడు. దీనితో పాటు దిగ్వేష్ రతి(Digvesh Rathi) మ్యాచ్ ఫీజులో 50 శాతం కూడా తగ్గించబడింది. అభిషేక్ శర్మ తన మ్యాచ్ ఫీజులో 25 శాతం కూడా కోల్పోవాల్సి వచ్చింది. మైదానంలో అభిషేక్ శర్మ, దిగ్వేష్ రతిల మధ్య తీవ్ర వాదన జరిగింది. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దిగ్వేష్‌పై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా లక్నో స్పిన్నర్ తన ప్రవర్తన కారణంగా తన మ్యాచ్ ఫీజును కోల్పోవలసి వచ్చింది. దిగ్వేష్ ఇప్పుడు మొత్తం 5 డీమెరిట్ పాయింట్లను కలిగి ఉన్నాడు. దీని కారణంగా దిగ్వేష్ ఇప్పుడు ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.దిగ్వేష్ రతి వేసిన 8వ ఓవర్‌లో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59)ను క్యాచ్ ఔట్ చేశాడు. ఈ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ శర్మ(Abhishek Sharma) వికెట్ పారేసుకున్నాడు. సెట్ అయిన బ్యాటర్ ఔటవ్వడంతో దిగ్వేష్ రతి వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు. తన ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ క్రమంలో కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయిన దిగ్వేష్ బయటికి వెళ్లిపోవాలంటూ సైగలు చేశాడు.ఇది నచ్చని అభిషేక్ శర్మ అతనిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దిగ్వేష్ రతి కూడా అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దర్నీ అడ్డుకున్నారు. ఐపీఎల్ నిబంధనలను ఉల్లగించినందుకు ఈ ఇద్దరికి ఇప్పుడు శిక్ష పడింది.
Read Also : IPL 2025: లక్నో పై సన్‌రైజర్స్ ఘన విజయం