మయన్మార్‌ను శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. పశ్చిమ మండేలాలో రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంతో అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇప్పటి వరకూ 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మంది వరకూ గాయపడినట్టు అధికారులు తెలిపారు.భూకంపంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు నివేదికలు అందుతున్నాయి. మయన్మార్ రాజధాని నెపిడాలోని 1000 పడకల ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిపోయింది. గాయపడినవారికి ఆసుపత్రి భవనం వెలుపల వీధుల్లోనే చికిత్స అందజేస్తున్నారు. బాధితులను కుటుంబసభ్యులు, ప్రియమైనవారు ఓదార్చుతున్న భవనం వెలుపలి దృశ్యాలు గాయపడిన వారికి వీధుల్లో చికిత్స అందజేస్తున్నట్టు చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా ఏఎఫ్‌పీ తెలిపింది.

ధ్వంసమైన బ్రిటిష్ కాలం నాటి వంతెన
మండేలాలోని నివాస భవనాలు కూలిపోయాయి. ఇర్రవడ్డి నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన, థాయిలాండ్ సరిహద్దులో ఉన్న ఒక మఠం కూడా ధ్వంసమైంది. సగైంగ్ పట్టణానికి 16 కి.మీ దూరంలో భూకంప కేంద్రం.. భూమికి 10 కి.మీ లోతులో ఉన్నట్టు గుర్తించారు. అటు, థాయ్‌లాండ్‌లో భూకంపం పెను విధ్వంసం మిగిల్చింది. ఉత్తర థాయ్‌లాండ్‌లో చాలా ప్రాంతాల్లో భవనాలు నెలమట్టామయ్యాయి. రాజధాని బ్యాంకాక్‌లో మెట్రో, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. థాయ్‌లాండ్ విమానాశ్రయాన్ని లాక్‌డౌన్ చేశారు. థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా దేశంలోనే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలోని ఉన్న 30 అంతస్తుల భవనం కూలిపోగా.. అందులో 43 మంది చిక్కుకున్నారు. ఈ భవనం కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.