సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇది నటుడు ప్రకాశ్ రాజ్ కు కౌంటర్‌గానే ట్వీట్ చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
బండ్ల గణేశ్ ట్వీట్
కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి”అని ఆయన ట్వీట్ చేశారు.ఇది చూసిన నెటిజన్లు కచ్చితంగా ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించే గణేశ్ ఈ ట్వీట్ చేశారని అంటున్నారు. మా ఎన్నికల సమయంలో అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పవన్ కల్యాణ్,విష్ణుకు కాకుండా ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇచ్చారు. అలాంటి పవన్‌పై ఇప్పుడు ప్రకాశ్ రాజ్ సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేశ్ తాజాగా కృతజ్ఞతగా ఉండాలంటూ ట్వీట్ చేశారని అంటున్నారు. కాగా, నిన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. బహుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని ఆయన ట్వీట్ చేశారు. స్వాభిమానంతో తమ మాతృభాషను, తల్లిని కాపాడుకునే ప్రయత్నమనే విషయాన్ని పవన్ కు దయచేసి ఎవరైనా చెప్పాలని ప్రకాశ్ రాజ్ కోరారు.
విష్ణువర్ధన్ రెడ్డి స్పందన
హిందీ భాష వద్దు కానీ,హిందీ భాషలో సినిమాలు విడుదల చేసుకోవడం ద్వారా లభించే డబ్బు మాత్రం కావాలా? అంటూ నిన్న తమిళ నేతలపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పవన్ వ్యాఖ్యలకు ఇవాళ నటుడు ప్రకాశ్ రాజ్ బదులివ్వడం తెలిసిందే. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “మీరు బతకడం కోసం కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలు నేర్చుకున్నారు. హిందీ సినిమాల ద్వారా డబ్బు సంపాదించడం ఓకే కానీ అదే భాషపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం తల్లి పాలు తాగి ఆ తల్లికి ద్రోహం చేసినట్లే అవుతుంది. భాషను ప్రేమించడం తప్పు కాదు,కానీ నీలాంటి వాళ్లు రాజకీయ ఓటు బ్యాంకు కోసం భాషను వాడుకోవడం సిగ్గు చేటు” అంటూ ఆయన మండిపడ్డారు.ఈ పరిణామాల నేపథ్యంలో, పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్లు, వాటికి బండ్ల గణేశ్, బీజేపీ నేతల కౌంటర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.