ప్రతిష్టాత్మక ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్(Asian Athletics Championships) పోటీల్లో భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటుతూ పతకాల పంట పండిస్తున్నారు. తొలిరోజే రెండు పతకాలు సాధించిన భారత్ బృందం, రెండో రోజు మరింత దూకుడుగా ఆడింది. అట్టహాసంగా ఆరు పతకాలు గెలుచుకుని మెగా ఈవెంట్(Mega event)లో భారత్ దూసుకెళ్తోంది. 4X400 మిక్స్‌డ్ రిలేలో స్వర్ణం గెలిచిన మన అథ్లెట్లు డెకథ్లాన్, ట్రిపుల్ జంప్, మహిళల 1500 మీటర్లు, 400 మీటర్ల రేసులో రజతాలతో మెరిశారు.

పాయింట్లు
4X400 మిక్స్‌డ్ రిలేలో సంతోష్ కుమార్, రూపల్, విశాల్, సుభా వెంకటేశన్‌తో కూడిన భారత బృందం 3 నిమిషాల 18.12 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి స్వర్ణం గెలిచింది. ఈ రేసులో చైనా (3:20.52) రెండో స్థానంతో రజతం గెలవగా శ్రీలంక (3:21.95) కాంస్యం నెగ్గింది. మహిళల 400 మీటర్ల ఫైనల్ రేసులో రూపల్ 52.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజతం(Silver) సాధించింది. జపాన్ (52.17 సెకన్లు)కు స్వర్ణం, ఉజ్బెకిస్థాన్ (52.79 సె.)కు కాంస్యం దక్కాయి. మహిళల 1500 మీటర్ల రేసులో పూజ 4:10.83 సెకన్లతో గమ్యాన్ని ముద్దాడి రజతంతో సత్తాచాటింది.పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్(Praveen Chitravel) 16.90 మీటర్లు దూకి రజతం సొంతం చేసుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ అబ్దుల్లా 16.72 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. పురుషుల డెకథ్లాన్‌లో తేజస్విని శంకర్ 7,618 పాయింట్లు స్కోరు చేసి రజతం పట్టుకొచ్చాడు. కేవలం 16 పాయింట్లతో అతడు స్వర్ణం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. పురుషుల 1500 మీటర్ల రేసులో యూనస్ షా.. 3:43.03 సెకన్లతో కాంస్యం దక్కించుకున్నాడు.
Read Also: Grand Slam Tournament: మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లిన అల్కరాజ్