ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఊహించని తీర్పు ఒకటి సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. బస్సు ఢీ కొట్టడం వల్ల ఓ మహిళ మృతి చెందడంతో.. ఆమె కుటుంబ సభ్యులకు రూ.9 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు.. ఏపీఎస్ఆర్టీసీని ఆదేశించింది. ఐతే.. ఈ కేసు అసలు సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్లింది? అసలు కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎందుకొచ్చింది?
కేసు పూర్తి వివరాలు
భారత్‌కి చెందిన నాగళ్ల లక్ష్మీ అనే మహిళ.. గ్రీన్ కార్డు హోల్డర్‌గా అమెరికాలో ఉంటూ, ఉద్యోగం చేస్తున్నారు. ఓసారి ఇండియా వచ్చిన ఆమె 2009 జూన్ 13న భర్త, ఇద్దరు కూతుర్లతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం బయలుదేరింది. అలా వెళ్తున్న సమయంలో.. సడెన్‌గా ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి, బలంగా ఢీకొట్టింది. దాంతో.. కారు తుక్కైంది. కారులోని లక్ష్మీ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మృతురాలి భర్త శ్యాంప్రసాద్ రూ.9 కోట్ల పరిహారం కోరారు. తాను భార్యను కోల్పోయాననీ, తన పిల్లలకు తల్లి లేని లోటు ఏర్పడిందని చెప్పారు. ఐతే.. అంత పరిహారం ఇచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఒప్పుకోలేదు. దాంతో.. ఆయన.. సికింద్రాబాద్‌లోని మోటార్ యాక్సిడెంట్స్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు.

హాట్ టాపిక్ గా మారిన కేసు
అప్పట్లో ఈ కేసు హాట్ టాపిక్ అయ్యింది. ట్రిబ్యునల్ రెండువైపులా వాదనలు వింది. చనిపోయిన మహిళ.. అమెరికాలో ఉంటున్నారు కాబట్టి.. రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని 2014లో ఆర్టీసీని ఆదేశించింది. ఈ కేసులో అంత పరిహారం చెల్లించడం ఇష్టం లేని ఆర్టీసీ.. హైకోర్టుకి వెళ్లింది. హైకోర్టు ఈ కేసును విచారించి.. రూ.5.75 కోట్లు చెల్లించమని తీర్పు ఇచ్చింది. తాము అమెరికాలో ఉండాల్సి ఉంటుంది కాబట్టి.. ఈ పరిహారం సరిపోదంటూ.. మృతురాలి భర్త సుప్రీంకోర్టుకి వెళ్లారు.
చనిపోయిన మహిళ అమెరికా పౌరురాలు
ఈ కేసులో మృతురాలి భర్త వాదనను సుప్రీంకోర్టు వివరంగా తెలుసుకుంది. ఆయన అత్యున్నత న్యాయ స్థానానికి చాలా స్పష్టంగా పరిస్థితిని వివరించారు. తన భార్య అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిందనీ, అక్కడే శాశ్వత నివాసిగా ఉందని చెప్పారు. అంతేకాదు.. నెలకు 11,600 డాలర్లు (ప్రస్తుత రూపాయల్లో రూ.10,07,268) సంపాదించేదని తెలిపారు. అందువల్ల ఆమె మరణం తమకు తీరని లోటు అనీ.. అందుకే పరిహారం రూ.9 కోట్లు ఇప్పించమని కోరారు. ఆయన వాదనలో న్యాయం ఉంది అని సుప్రీంకోర్టు భావించింది. చనిపోయిన మహిళ అమెరికా పౌరురాలు కిందకు వస్తుంది కాబట్టి.. అక్కడి అంశాలు, ఖర్చులు, ఆదాయాలను లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు భావించింది. అందుకే మొత్తం రూ.9,64,52,220 చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీని ఆదేశించింది.