వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్న వేళ ఈ బిల్లుకు టీడీపీ మద్దతు తెలిపినందుకు రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖిల భారత ముస్లిం లాబోర్డు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన
ముస్లిం సంఘాలు కేంద్రం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులకు ముస్లింల హాజరు కాలేదు.విజయవాడ, ఏలూరు, గుంటూరు, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరించారు.మసీదులకు నల్ల రిబ్బన్లు ధరించి హాజరై నిరసన తెలపాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు పిలుపునిచ్చింది.
ఏలూరులో ఇఫ్తార్ విందు గైర్హాజరు
ఏలూరులో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన భవన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లింలు హాజరుకాలేదు. జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్, టిడిపి నాయకులు అక్బర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్ లో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా జోక్యాన్ని ముస్లింలు సహించరని అందుకే ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించినట్లు కలెక్టర్ వెట్రి సెల్వికి తెలిపారు. ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి తాము 10 మంది వచ్చామని చెప్పారు.ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ ముస్లిం నేతలు కలెక్టర్‌ను కోరారు.

ముఖ్య అతిథి
ముస్లింల సంక్షేమానికి పుణ్యం కోసం ఇచ్చిన భూములపై ప్రభుత్వాల పెత్తనం సరైనది కాదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వెట్రి సెల్వి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై ముస్లిం సంఘాలు ఆగ్రహం
ప్రభుత్వాల పెత్తనం సరైనదికాదని, వక్ఫ్ భూముల స్వతంత్రతను కాపాడాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు.ఇది ముస్లింల హక్కులకు భంగం కలిగించే అంశమని ముస్లిం సంఘాలు చెబుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు కూటమి ప్రభుత్వం మద్దతు ఉపసంహరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనలు ఉద్యమం చేపట్టాయి.వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ముస్లింల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది.