ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని డిజిటల్ అక్షరాస్యుడిగా మార్చాలని సంకల్పించారు. ఈ లక్ష్యంతో రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులను కృషి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పీపుల్స్ పర్సెప్షన్, ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

వాట్సాప్ గవర్నెన్స్ – సులభతర సేవలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ గురించి సమీక్షిస్తూ, ప్రజలందరూ దీన్ని సులభంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రజలు ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే, ప్రజల్లో దీనిపై అవగాహన తక్కువగా ఉన్నందున, మరింత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు బాధ్యత తీసుకుని వాట్సాప్ గవర్నెన్స్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. సచివాలయాలు, సచివాలయ సిబ్బంది ద్వారా దీని గురించి అవగాహన పెంచాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వ సేవలను పొందడమే కాకుండా, తమ ఫిర్యాదులు, అర్జీలు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పంపవచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. అంతేకాదు, నిరక్షరాస్యులు కూడా తమ ఫిర్యాదులను వాయిస్ మెసేజ్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే సదుపాయం త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ అక్షరాస్యత పెరిగితే వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం కూడా పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఆర్టీఐజీఎస్ ద్వారా విస్తృత సేవలు
ప్రస్తుతం వాట్సాప్ ద్వారా 200 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నామని, ఈ నెలాఖరు వరకు మరో 150 అదనపు సేవలను జతచేస్తామని ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యదర్శి భాస్కర్ కాటమనేని సీఎం చంద్రబాబుకు వివరించారు. తద్వారా మొత్తం వాట్సాప్ గవర్నెన్స్ సేవలు 350కి చేరుతాయని చెప్పారు.
భవిష్యత్తులో మొత్తం 500 సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పెద్ద ఎత్తున వినియోగించి వన్ స్టేట్ వన్ యాప్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనిద్వారా ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు కేవలం ఒకే ఒక ప్లాట్‌ఫామ్‌లో లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అటవీ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, సీఎం కార్యదర్శులు ముద్దాడ రవిచంద్ర, ప్రద్యుమ్న, రాజమౌళి, హోంశాఖ ఐటీ సెల్ ఐజీ శ్రీకాంత్, ఐజీ ఈగల్ ఆర్‌కె రవికృష్ణ, సీఈఓ వి. కరుణ, ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త విధానాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు సులభమైన, పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ అక్షరాస్యత పెంపొందించుకోవడం ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను మరింత సమర్థంగా వినియోగించుకోగలుగుతారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మార్గంలో ముందంజ వేస్తుందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.