ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరగనుంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి (Chandrababu) నేతృత్వంలో పలు కీలక అంశాలపై సమీక్ష జరగనుంది. ముఖ్యంగా జూన్ 12 నాటికి ప్రస్తుత ప్రభుత్వ ఏర్పాటుకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో, ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షతో పాటు తదుపరి ప్రచార యోజనలపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సంక్షేమ ఫలితాలపై కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలనే ప్రతిపాదనలు
భేటీలో ఉద్యోగుల బదిలీల అంశం కూడా ముఖ్యంగా చర్చించనుంది. దీని కోసం సంబంధిత శాఖల నుంచి నివేదికలు సమర్పించబడి, కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలనే ప్రతిపాదనలు ఉంచే అవకాశముంది. అదనంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు అవసరమైన భూముల కేటాయింపు అంశంపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పోలవరం మరియు బనకచర్ల ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులపై సమీక్ష జరగనుంది.
19 ప్రాజెక్టులకు ఆమోదం
అలాగే రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి SIPB (State Investment Promotion Board) సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు గానూ రూ.33,000 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. ఈ పెట్టుబడుల ద్వారా కొత్త ఉద్యోగాలు, పారిశ్రామిక వృద్ధికి ఊతమిచ్చే అవకాశముందని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ క్యాబినెట్ భేటీ రాష్ట్ర పాలన, అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక రంగాలకు సంబంధించి దిశానిర్దేశకంగా నిలవనుంది.
Read Also : Waqf Act : వర్ఫ్ సవరణ చట్టంపై నేడు విచారణ