నిపుణుల కమిటీ సిఫారసు
రాజంపేట : నదీ గర్భంలో ఏనుగులు దూరే అంతటి సొరంగాలు ప్రాజెక్టు నిర్మాణానికి ఇది పెద్ద అవరోధం. దేశ విదేశాల నుంచి ఎందరో నిపుణులు వచ్చారు. అమెరికా నుంచి ఓ ఇంజనీరింగ్ నిపుణుడు కూడ ఈ ప్రాజెక్టును (Project) సందర్శించారు. అందరూ నిపుణులు పరిశీలించిన తర్వాతే సుమారు 52ఏళ్ల క్రితం ప్రాణం పోసుకున్న కడప జిల్లా రాజంపేట మండలంలో చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టును (Annamaya project) ఎలాంటి సమస్య లేకుండా 1999నాటికి కేవలం 50కోట్ల వ్యయంతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో (With technology) పూర్తి చేశారు. ఆసియా ఖండంలోనే ఎర్త్ డ్యాంలో గ్యాలరీ ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ఇదే. అలాంటి ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. గత వైఎస్సార్సీ సర్కార్ హయాంలో పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ దెబ్బతినడంతో ఇదే విధంగా జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగానే ఇక్కడ కూడ అదే విధానాన్ని అమలు చేయడానికి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నిపుణుల కమిటీలో సభ్యునిగా వచ్చిన పోలవరం ప్రాజెక్టు (Project) చీఫ్ ఇంజనీర్ రమేష్కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అన్నమయ్య ప్రాజెక్టు భద్రతపై మరోసారి మదింపు
అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి నిపుణుల కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న నేపధ్యంలో ‘వార్త’ అందిస్తున్న ప్రత్యేక కధనం ఇది.. ఉమ్మడి కడప జిల్లాలో చెయ్యేరు నదిపై అన్నమయ్య ప్రాజెక్టును 2.24 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు నీటి విడుదల సామర్ధ్యం నాటి డిజైన్ ప్రకారం 1.85 లక్షలు. అయితే అన్నమయ్య ప్రాజెక్టు ఎర్త్ డ్యాం కొట్టుకుపోయినప్పుడు 2021 నవంబర్ 19న చెయ్యేరు నదికి భారీ వరదలు వచ్చినప్పుడు వచ్చిన ఇన్ 4 నుంచి 5 లక్షలు అని అధికారులు చెబుతున్నారు. 2003లో కూడ ఒక ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం, 2019లో కూడ ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం. 2021లో ఏకంగా అధికారుల నిర్లక్ష్యమో, ప్రకృతి వైపరిత్యమో తెలియదు కానీ ఏకంగా ఎర్త్ డ్యామే కొట్టుకుపోయింది. ఈ వరుస ఘటనల నేపధ్యంలో మరోసారి ఈ ప్రాజెక్టుకు ఇలాంటి ఉపద్రవం రాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది.
“నదీ గర్భ సొరంగాలు – ప్రారంభంలో గుర్తించి మారిన డిజైన్, కానీ ముప్పు ఎలా తప్పలేకపోయింది?”
నిపుణుల కమిటీలో పోలవరం చీఫ్ ఇంజనీర్ (కేంద్ర జలసంఘం నిపుణుడు) రమేష్ కుమార్, విశ్రాంత హైడ్రోమెకానికల్ ఎక్స్పర్ట్ కే.సత్యనారాయణ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డైరెక్టర్ జనరల్ ఎం.రాజుతో పాటు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్, కడప జిల్లా జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీరామ చంద్రమూర్తి ఈనెల 13న అన్నమయ్య ప్రాజెక్టును క్షున్నంగా పరిశీలించారు. ఇకపోతే అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం సంధర్భంగా నదీ గర్భంలో సొరంగాలు(క్యావిటీస్) బయటపడ్డాయి. చెయ్యేరు నదిలో ఎడమ వైపు కొండ ప్రక్కనే రెండు గేట్లను కుడివైపు కొండ ప్రక్కనే మూడు గేట్లను నిర్మించాలని అప్పటికే సిద్ధం అయిన డిజైన్లను పరిశీలించారు. అప్పుడే బయటపడిన సొరంగాలతో ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఎడమవైపునే 5గేట్లను ఏర్పాటుచేసి స్పిల్వే నిర్మించారు. 476మీటర్ల పొడవునా కుడివైపు కొండ వరకు ఎర్త్ డ్యాం నిర్మించారు. ఎర్త్ డ్యాం నిర్మాణానికి ముందే నీరు లీకేజ్ కాకుండా సొరంగాలలోకి డ్రిల్లింగ్, గ్రౌటింగ్ పద్దతిలో కొన్ని వందల టన్నుల లిక్విడ్ సీమెంట్ను చొప్పించారు. డయాఫ్రం వాల్ను నిర్మించారు. ఎర్త్ డ్యాంలో గ్యాలరీ నిర్మాణం తర్వాత కేంద్ర జలసంఘం ఆదేశించిన మేరకు అబ్జర్వేషన్ పీరియడ్లో ఎక్కడ నీరు లీకేజీ కాలేదు. దీంతో నదీ గర్భంలో చేసిన డ్రిల్లింగ్, గ్రౌటింగ్ సక్సెస్ అయినట్లు భావించి క్రమేణా నీటి నిల్వను చేపట్టారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన తర్వాత కూడ ఎలాంటి లీకేజీ కనిపించలేదు. దీంతో ఇంజనీర్లు ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి ప్రాజెక్టుకు ఎర్త్ డ్యాం కొట్టుకుపోయి గండం వచ్చి పడింది.
“చెయ్యేరు గర్భంలో ఇసుక 40 మీటర్ల లోతు – కాంక్రీట్ డ్యాం అవకాశాలు తగ్గేనా?”
అసలు ప్రాజెక్టు పునర్నిర్మించాలంలే మరళా ఎర్త్ డ్యాం (మట్టి కట్ట) నిర్మించాలా లేక రాక్ ఫిల్ డ్యాం కట్టాలా అదీ కాదంటే పూర్తిగా కాంక్రీట్ డ్యాం కట్టాలా అన్నది ఇంజనీర్ల ముందున్న ప్రత్నామ్యాయాలు. కాంక్రీట్ డ్యాం నిర్మించేందుకే గత ఏడాది ఇంజనీర్లు అంచనాలు రూపొందించి 787 కోట్ల వ్యయంతో టెండర్లు పూర్తి చేశారు. ప్రాజెక్టు ఇంజనీర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పునర్నిర్మాణానికి 2డిజైన్లను సిద్ధం చేసి పంపింది. ఇక డిజైన్ ప్రకారం ప్రస్తుతం ఉన్న 5గేట్లకు తోడు మరో 16గేట్లు ఏర్పాటుచేసి కాంక్రీట్ డ్యాం నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు. మరొక డిజైన్ ప్రకారం రాక్ ఫిల్ డ్యాం నిర్మించి కుడివైపున ఉన్న కొండ ప్రక్కన అవసరం అయిన గేట్లను ఏర్పాటుచేయాలని డిజైన్ సిద్ధం చేశారు. తాజాగా నిపుణుల కమిటీ పరిశీలన తర్వాత ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నదీ గర్భంలో ఉన్న భౌతిక పరిస్థితిని తెలుసుకోవాల్సి ఉంది. నదీ గర్భంలో డయా ఫ్రం వాల్ను 45మీటర్ల ఎత్తున నిర్మించి ఉన్నారు. ఈ కట్టడాల భౌతిక పరిస్థితి తెలుసుకునేందుకే జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ ను చేయనున్నారు. ఇకపోతే కాంక్రీట్ డ్యాం నిర్మాణం ఇసుక సుమారు 40మీటర్ల లోతు వరకు నదీ గర్భంలో ఉన్న నేపధ్యంలో నిపుణులు అంగీకరించే అవకాశాలు తక్కువే. ఇసుక ఎక్కువగా ఉన్న ఏ నదిలో అయినా ఎర్త్ డ్యాంను లేదా రాక్ ఫిల్ డ్యాంనే నిర్మించేందుకు సిఫార్స్ చేస్తారు. ఈ పరిస్థితిని పరిశీలిస్తే చెయ్యేరు నదిలో ఇసుక 40మీటర్ల లోతు వరకు నిక్షిప్తమై ఉండటం, సొరంగాలు కూడ ఉన్నందువల్ల కాంక్రీట్ డ్యాం నిర్మాణం అనుమానమే. ఎందుకంటే ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం సమయంలో కుడి వైపు 3గేట్లు నిర్మించి, ఎడమవైపు 2గేట్లు ఏర్పాటుచేసి మధ్యలో ఎర్త్ డ్యాం నిర్మించాలనే ప్రతిపాదన ఉపసంహరించుకున్న నేపధ్యంలో అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సులు చేస్తుందో వేచి చూడాల్సిందే.
అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి నిపుణుల కమిటీ ఎలాంటి సూచన చేసింది?
నదీ గర్భ భౌతిక పరిస్థితులను తెలుసుకోవడానికి జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని సిఫార్సు చేసింది.
కాంక్రీట్ డ్యాం నిర్మాణంపై నిపుణుల అభిప్రాయం ఏమిటి?
నదీ గర్భంలో 40 మీటర్ల లోతు వరకు ఇసుక ఉండటంతో కాంక్రీట్ డ్యాం అనుకూలం కాదని నిపుణులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Tirumala : ప్రవాసాంధ్రులకు రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు