జగన్ కాన్వాయ్ ఘటనపై షర్మిల ఆగ్రహం: “ఇదేం రాజకీయం? ఇదెక్కడి రాక్షస ఆనందం?”
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సంఘటన భయానకమని, ఒళ్ళు గగుర్పొడిచేలా ఉందని ఆమె తన సోషల్ మీడియాలో స్పందించారు. ఈ ఘటనకు జగన్‌దే పూర్తి బాధ్యత అని ఆమె దుయ్యబట్టారు. “కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ చేతులూపడం ఏంటి?” అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల ప్రాణాలను తీసే హక్కు ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. బెట్టింగ్‌లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఇదేం రాజకీయం? ఇదెక్కడి రాక్షస ఆనందం? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా?” అంటూ షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్ సైడ్ బోర్డు మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా అని ప్రశ్నిస్తూ, ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యతారాహిత్యాన్ని అద్దం పడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన జగన్ కాన్వాయ్ వీడియోను కూడా షర్మిల పంచుకున్నారు.

కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై ప్రశ్నలు
సింగయ్య మృతికి కారణమైన జగన్‌తో పాటు, 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని షర్మిల డిమాండ్ చేశారు. పర్మిషన్‌కు విరుద్ధంగా జన సమీకరణ జరుగుతున్నా పోలీసులు ఎలా సహకరించారని, ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎందుకు నిద్ర పుచ్చారని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ తమకేనా అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌస్ అరెస్ట్‌లు చేస్తారని, దీక్షలను భగ్నం చేస్తారని, ర్యాలీలను అడ్డుకుని తమ గొంతు నొక్కుతారని షర్మిల మండిపడ్డారు. వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం ఇస్తారని ఆమె ప్రశ్నించారు.
ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది?
ఈ ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని, దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని షర్మిల నిలదీశారు. రాజకీయ బల ప్రదర్శనల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరైన పద్ధతి కాదని ఆమె స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ సంఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని షర్మిల కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలకు విలువ లేనప్పుడు, ఆ నాయకులకు, ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.