Venkatagiri Govt School: తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు తమ నిజాయితీతో అందరి మనసు గెలుచుకున్నారు. వెంకటగిరి జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లో చదువుతున్న గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతిక (8వ తరగతి), పద్మశ్రీ (6వ తరగతి), హేమలత (7వ తరగతి) అనే విద్యార్థినులు గురువారం సాయంత్రం బస్సు కోసం నిరీక్షిస్తుండగా వారికి ఒక పర్సు దొరికింది. అందులో విలువైన బంగారు నగలు మరియు నగదు ఉండటాన్ని గమనించిన ఆ చిన్నారులు, ఏమాత్రం తడబడకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
Read Also: S. Savitha: వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

ఆదర్శంగా నిలిచిన విద్యార్థినులు
విద్యార్థినులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ స్వరూపకు ఆ పర్సును అందజేశారు. అనంతరం వారు బస్టాప్‌కు రాగా, అక్కడ ఒక మహిళ తన పర్సు పోయిందని ఆవేదనతో వెతుకుతుండటం చూశారు. తాము పర్సును స్టేషన్‌లో ఇచ్చామని చెప్పి, ఆమెను వెంటబెట్టుకుని మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నగలు, నగదు ఆమెవేనని నిర్ధారించుకున్న పోలీసులు, ఆ మహిళకు ఆభరణాలను అందజేశారు. చిన్న వయసులోనే ఆ విద్యార్థినులు చూపిన నైతిక విలువలు స్థానికులను ఆశ్చర్యపరిచాయి.
ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మా ప్రభుత్వ స్కూల్ పిల్లలు బంగారం” అంటూ విద్యార్థినుల ఫోటోలను షేర్ చేశారు. “నిజాయితీ, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు మా విద్యార్థులు. మీ నీతివంతమైన ప్రవర్తన అందరికీ ఆదర్శం. విద్యాశాఖ గౌరవాన్ని పెంచిన మీలాంటి చెల్లెమ్మలకు ఈ అన్న ఎప్పుడూ అండగా ఉంటాడు” అంటూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వయసులో చిన్నవారైనా, విలువల్లో పెద్దవారమని ఈ విద్యార్థినులు నిరూపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: