వితరణశాలలో కౌంటర్ల వద్దే డిజిటల్ చెల్లింపులకు సన్నాహాలు
కియోస్క్ యంత్రాల వద్ద రద్దీతో వినూత్న ఆలోచన
తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాలను ఎలాంటి అసౌకర్యం లేకుండా, సులభంగా అందుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు పలు విధానాలు అమలులో ఉన్నప్పటికీ, లడ్డూ వితరణశాలల్లోని కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ అధికంగానే కొనసాగుతోంది. గత కొంతకాలంగా అమలవుతున్న కియోస్క్ యంత్రాల ద్వారా డిజిటల్ పేమెంట్, నగదు చెల్లింపుల సమయంలో కూడా రద్దీ పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భక్తులు ఎక్కువసేపు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో కౌంటర్ల వద్ద పొడవైన క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. ఐదు నుంచి పది లడ్డూలు పొందడానికి కూడా ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను కొంతవరకు అధిగమించి, భక్తులకు సాఫీగా మరియు వేగంగా లడ్డూలు అందించేందుకు టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి వినూత్న ఆలోచన చేశారు.
Read also: Gurazala court verdict : పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ నిర్ణయం!

Laddu Prasad now easier for devotees
తిరుగు ప్రయాణంలో లడ్డూ ప్రసాదం పొందేందుకు
శ్రీవారి భక్తులకు లడ్డూప్రసాదాన్ని మరింత సులభంగా, త్వరగా అందించేందుకు లడ్డూ కౌంటర్ల వద్దనే డిజిటల్ పేమెంట్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు జరిపేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఈ విధానం అమలులోకి వస్తే భక్తులు క్యూలైన్లలో ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకుండా, నేరుగా కౌంటర్ల వద్ద సిబ్బంది ద్వారా లడ్డూలు పొందవచ్చని అధికారులు భావిస్తున్నారు. తిరుమలకు ప్రతిరోజూ సుమారు 90 వేల మంది భక్తులు వస్తుండగా, రోజువారీగా సగటున 80 వేల మంది వరకు ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో లడ్డూ ప్రసాదం పొందేందుకు వితరణశాలల వద్ద భక్తులు బారులు తీరుతున్నారు. రోజుకు సగటున నాలుగు లక్షల వరకు లడ్డూలు విక్రయమవుతున్నాయి. ఈ రద్దీని తగ్గించేందుకు టీటీడీ ఇప్పటికే కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా యూపీఐ విధానంలో చెల్లింపు చేస్తే ఒక్కో భక్తునికి గరిష్టంగా ఐదు లడ్డూల వరకు పొందే అవకాశం ఉంది. కియోస్క్ ద్వారా పొందిన రశీదును కౌంటర్ సిబ్బందికి చూపిస్తే లడ్డూలు అందజేస్తున్నారు. అయితే ఈ విధానానికి కూడా భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో, కియోస్క్‌ల వద్ద కూడా రద్దీ పెరిగింది.
దీనివల్ల లడ్డూలు వేగంగా, సత్వరంగా అందించేందుకు
దీంతో భక్తులకు మరో ప్రత్యామ్నాయాన్ని చూపాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. లడ్డూ కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ బోర్డులు, స్టిక్కర్లు ఏర్పాటు చేసి, భక్తులు శ్రీవారి దర్శనానంతరం నేరుగా కౌంటర్ వద్దకు చేరుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ చెల్లింపులు జరిపే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల లడ్డూలు వేగంగా, సత్వరంగా అందించేందుకు అవకాశం కలుగుతుంది. తిరుమలలో మొత్తం సుమారు 60 లడ్డూ కౌంటర్లు ఉండగా, తొలి విడతలో ఈ వారంలో 20 కౌంటర్లలో ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. రానున్న వేసవికాలంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ముందస్తుగానే ఆధునిక సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ చర్యలు చేపడుతోంది.
ఈ యూపీఐ చెల్లింపు సేవలు అందుబాటులోకి వస్తే లడ్డూల కోసం భక్తులు ఎదుర్కొనే నిరీక్షణ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో సేవా టిక్కెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనాల టిక్కెట్లకు సంబంధించి భక్తులు డిజిటల్ పేమెంట్ ద్వారా ఎక్కడ నుంచైనా ఆన్లైన్లో చెల్లింపులు చేసి దర్శన టిక్కెట్లు పొందుతున్నారు. ప్రస్తుతం తిరుమలకు వచ్చిన ప్రతి భక్తునికి ఒక లడ్డూ ఉచితంగా అందిస్తున్నారు. అదనపు లడ్డూల కోసం మాత్రం వితరణశాలల వద్ద కౌంటర్లలో బారులు తీరాల్సి వస్తోంది. ఇప్పుడు లడ్డూలకు కూడా యూపీఐ చెల్లింపుల విధానం అమలైతే, భక్తులకు క్యూలైన్లలో నిరీక్షణ బాధలు తప్పనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: