క్లీన్ చిట్ ప్రచారం అబద్ధం – సిట్ ఛార్జ్‌షీట్‌లోనే కల్తీ స్పష్టం
Tirumala Laddu Ghee Controvery: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై క్లీన్ చిట్ వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రంగా ఖండించారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తులను మోసం చేసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ జరగలేదనడం వాస్తవం కాదని, సిట్ (SIT) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లోనే కల్తీ జరిగినట్లు స్పష్టంగా నమోదైందని ఆయన గుర్తుచేశారు.
Read Also: Tirumala Laddu Controversy : 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు – జనసేన
రూ. 250 కోట్ల కుంభకోణం – నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు
గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో భారీగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని చైర్మన్ ఆరోపించారు. కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే రూల్స్ మార్చారని, కనీసం ఉత్పత్తి సామర్థ్యం లేని సంస్థలకు టెండర్లు అప్పగించారని తెలిపారు. సుమారు రూ. 250 కోట్ల వ్యయంతో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు జరిగిందని, ఇందులో జంతు కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ (NDDB) నివేదిక ఇప్పటికే ధృవీకరించిందని ఆయన పేర్కొన్నారు.
అత్యంత ప్రమాదకర రసాయనాలు – 20 కోట్ల లడ్డూల అపవిత్రత
ఒక్క ఆవు కూడా లేని డైరీల నుంచి నెయ్యి కొనుగోలు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని బి.ఆర్. నాయుడు ప్రశ్నించారు. నెయ్యి తయారీలో వాడిన రసాయనాలు మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలను తయారు చేసి తిరుమల క్షేత్ర పవిత్రతను భ్రష్టు పట్టించారని, హైందవ సమాజంపై ఇది పెద్ద దాడి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైక్రో డీఎన్ఏ టెస్ట్ డిమాండ్ – బినామీల వెనుక పెద్దలెవరు?
నెయ్యి నాణ్యతపై పూర్తి నిజాలు బయటకు రావాలంటే ‘మైక్రో డీఎన్ఏ టెస్ట్’ నిర్వహించాలని చైర్మన్ డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీల వెనుక ఉన్న బినామీలు మరియు వారి ఖాతాల్లోకి జమ అయిన కోట్ల రూపాయల లావాదేవీలపై సిట్ లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. బినామీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో నిగ్గుతేల్చాలని కోరారు.
పవిత్రత రక్షణలో రాజీ లేదు
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ మహా పాపం వెలుగులోకి వచ్చిందని బి.ఆర్. నాయుడు స్పష్టం చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడటంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: