శ్రీశైలం జలాశయానికి సంబంధించిన ప్లంజ్ పూల్ ప్రాంతంలో తీవ్రమైన నష్టం జరిగినట్లు నిపుణులు గుర్తించారు. ఇటీవల కర్నూలు ఐఐటీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ కృష్ణా నాయక్ ఆధ్వర్యంలో అండర్ వాటర్ డ్రోన్ సాయంతో డ్యామ్ (Srisailam Dam) పరిస్థితిని సమీక్షించారు. ఈ పరిశీలనలో పూల్ అంచులు, సిలిండర్లు పూర్తిగా ధ్వంసమైనట్లు స్పష్టమైంది. ఈ పరిస్థితిలో డ్యామ్ భద్రతకు ముప్పు పొంచి ఉన్నదని వారు హెచ్చరించారు.
నీటి ప్రవాహం అధికం
డ్రోన్ కెమెరాలతో తీసిన చిత్రాల ఆధారంగా పరిశీలించిన నిపుణులు, పైకి కనిపించే దెబ్బల కంటే అంతర్గతంగా మరింత విస్తృతంగా నష్టం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో, ఈ విధంగా ప్లంజ్ పూల్ కు నష్టం జరిగినట్టు భావిస్తున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే, భవిష్యత్తులో తీవ్రమైన ప్రమాదాలకు కారణమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇంజినీరింగ్ శాఖలు అప్రమత్తం
ఈ నేపథ్యంలో సంబంధిత ఇంజినీరింగ్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, మరమ్మతుల పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని సూచిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు ముఖ్యమైన నీటి వనరుగా నిలుస్తోంది. అందువల్ల దీని భద్రతను కాపాడేందుకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు నీటిపారుదల శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన సమయంలో ఉన్నామని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Trump : ఎలాన్ మస్క్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం..