ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ప్రజలకు షాక్ ఇస్తోంది. మే నెలలో సాధారణంగా కేవలం ఉక్కపోత, ఎండ, వడగాలులు ఉండాలి అనుకుంటే ఊహించని విధంగా ఆకాశం మబ్బులతో నిండి, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తోంది. ఈ పరిస్థితి మరో మూడు రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండం ప్రభావం
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంగా ఉంది. ఇది తూర్పు దిశగా కదులుతున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఇది రత్నగిరి సమీపంలో తీరాన్ని దాటి పశ్చిమంగా కదిలే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మే 25 (ఆదివారం) వర్ష సూచన ఉన్న జిల్లాలు:
ఈ ఎఫెక్ట్ తోనే నేడు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
మే 26 (సోమవారం) వర్ష సూచన ఉన్న జిల్లాలు:
రేపు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా,పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాల్లో విస్తృతంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉంది.
ప్రజలందరికీ భద్రతా సూచనలు
హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వద్ద ప్రజాలు ఉండొద్దని సూచించింది. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఈ ఏడాదిలోనే పిడుగుపాటుకు గురై పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. వేసవిలో అకస్మాత్తుగా ఎదురవుతున్న వర్షాలు రైతులకు ఒక వరం కావచ్చు కానీ, పిడుగులతో కూడిన వర్షాలు ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశముంది. అందుకే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండటం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.
Read also: Andhrapradesh: ఏపీలో కొత్తగా 2 రైల్వే లైన్లు