ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు కేంద్ర స్థాయికి చేరింది. ముఖ్యమంత్రిపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంబటి రాంబాబుకు అసలైన ‘సినిమా’ చూపిస్తామంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటివరకు అంబటి తీరును సహనంతో భరించామని, కానీ ఇకపై తామేంటో చూపిస్తామని, తమ రియాక్షన్ ఎలా ఉంటుందో రాబోయే 24 గంటల్లో అర్థమవుతుందని పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

బరితెగించి మాట్లాడే నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసని, వారు భయపడేలా తమ ‘ట్రీట్‌మెంట్’ ఉంటుందని పెమ్మసాని హెచ్చరించారు. చట్టబద్ధంగా ముందుకు వెళ్తే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అంబటి రాంబాబు రుచి చూస్తారని ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయ విమర్శలు కాకుండా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇలాంటి పోకడలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే అంబటి అరెస్టుకు సిద్ధమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Arava Sreedhar : జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు
ప్రస్తుతం గుంటూరులోని అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. కేంద్ర మంత్రి హెచ్చరించినట్లుగానే, పోలీసులు చట్టపరమైన చర్యలను వేగవంతం చేశారు. అధికారికంగా నోటీసులు జారీ చేయడం, అరెస్టుకు ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయడం వంటి పరిణామాలు పెమ్మసాని అన్నట్లుగానే ‘రియాక్షన్’ మొదలైందని సూచిస్తున్నాయి. అంబటి రాంబాబు అరెస్టు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో, ఈ రాజకీయ యుద్ధం మరెన్ని మలుపులు తిరుగుతుందోనని ఏపీ ప్రజలు ఉత్కంఠగా గమనిస్తున్నారు.