ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ముఖ్యలక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తునిలో మంగళవారం నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ తెలుగుదేశం’ (suparipalana lo tholi adugu) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం పాలనను నేరుగా ప్రజల గడప వద్దకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టబడిందని మంత్రి తెలిపారు.
జగన్ విమర్శలు – రెడ్ బుక్ భయంతో వణికిపోతున్నారు
ఈ సందర్బంగా మంత్రి పార్థసారథి (Pardhasaradhi) ప్రతిపక్ష నేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో రాష్ట్రంలో రెచ్చగొట్టే మాటలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ‘నరుకుతాం, తొక్కేస్తాం’ వంటి మాటలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అలాగే ‘రెడ్ బుక్’ గురించి మాట్లాడుతూ – వైసీపీ నేతలకు గతంలో చేసిన దోపిడీలు, పాపాలు గుర్తొస్తున్నాయనడే ఆ బుక్కు చూసి భయపడుతున్నారని చెప్పారు. బొత్స సత్యనారాయణ వంటి నేతలు రెడ్ బుక్‌ను రాజ్యాంగంతో పోల్చడాన్ని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. రాష్ట్రం రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని, తప్పు చేయనివారికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యలపై వెంటనే స్పందన
కార్యక్రమం అనంతరం తారకరామనగర్ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు స్వయంగా విన్న మంత్రి పార్థసారథి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టారు. విద్యుత్తు సరఫరా, కాలువల మరమ్మతులు, ఉచిత గ్యాస్ లభ్యత వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై అక్కడే ఉన్న అధికారులను పిలిపించి తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే, జవాబుదారితనంతో కూడిన పాలన కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పునరుద్ఘాటించారు.
Read Also : TTD : టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్