NTR Bharosa Pensions: అర్హత ఉన్నవారికి కొత్త పింఛన్లను త్వరలో మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఎన్నారై సాధికారతా సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. శనివారం ఆయన గజపతినగరం మండలం జిన్నాం గ్రామంలో ఎన్‌టిఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
Read Also: Chandrababu Naidu: చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతీ నెలా 1వ తేదీన పింఛన్లను పంపిణీ చేయడానికి గ్రామాలకు వెళ్లడమే కాకుండా, అక్కడి ప్రజల సమస్యలను కూడా తెలుసుకొనేందుకు దోహదపడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రతీనెలా 1న పింఛన్ల పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో కొత్త పింఛన్లను మంజూరు చేసి పేద కుటుంబాలకు ఆసరానివ్వనున్నామని తెలిపారు.

సంప్రదాయ వరి పంట బదులు రెండో పంటగా ఉద్యాన పంటలు సాగు చేయాలని రైతులను మంత్రి కోరారు. దీనివల్ల రైతుకు ఆదాయం పెరుగుతుందని, ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తుందని చెప్పారు. అలాగే మహిళల ఆర్థికాభివృద్ధికి బ్యాంకుల నుంచి సులువుగా రుణాలు ఇప్పిస్తున్నామని, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నామని చెప్పారు. పనికోసం హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి మారిపోతుందన్నారు.
ముఖ్యమంత్రి దూరదృష్టి వల్లే భోగాపురం విమానాశ్రయం సాకారమయ్యిందని, దీనివల్ల జిల్లా గణనీయమైన ప్రగతి సాధిస్తుందని మంత్రి అన్నారు. జిన్నాం గ్రామంలోని 520 మంది పింఛన్ దారులకు రూ. 22,15,500 పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62,94,844 మందికి, పింఛన్ క్రింద రూ. 2724.10 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి శ్రీనివాసపాణి, మాజీ మంత్రి పడాల అరుణ, పలువురు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: