ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల (New Districts) ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై ప్రభుత్వం చేపట్టిన కసరత్తు కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడం, అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి లక్ష్యాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల సరిహద్దుల మార్పుపై వచ్చిన ప్రజా అభిప్రాయాలు, ప్రతిపాదనలు సేకరణ పూర్తయింది. ఇప్పుడు వాటిపై తుది నిర్ణయం తీసుకునే దశ మొదలైంది.
Read Also: TTD: పరకామణి కేసు పక్కదారి! రాజీలో టిటిడి ప్రమేయం ఉండదా!
మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం
జిల్లాల పునర్విభజన కోసం ప్రభుత్వం గతంలో ఈ విషయంలో ఏడుగురు మంత్రులతో కూడిన ఓ ప్రత్యేక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, గ్రామస్థాయి వార్డుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. మొత్తం 200కు పైగా అర్జీలు కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.
వీటన్నింటినీ సమగ్రమంగా పరిశీలించిన కమిటీ, వివిధ జిల్లాల్లోని కలెక్టర్లు, RDOలు, తహసీల్దార్ల అభిప్రాయాలను కూడా సేకరించింది.ఈ ఉపసంఘం రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది. ఈ సమావేశంలో వినతులు, సూచనలు, ప్రతిపాదనలు, ప్రస్తుత భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, జనాభా పంపిణీ వంటి అంశాలన్నింటిని ముఖ్యమంత్రి పరిశీలిస్తారని అంచనా.
నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి సూచనల మేరకు తుది నివేదికను కమిటీ సిద్ధం చేయనుంది. ఈ నివేదికను నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. జనగణన ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ప్రజల అభిప్రాయాలు, భౌగోళికత, పరిపాలన సౌలభ్యం వంటి ముఖ్య అంశాలను సమగ్రంగా పరిశీలించకపోవడం వల్ల చాలా ప్రాంతాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. కొన్ని మండలాలు తమ సహజ, వాణిజ్య, భౌగోళిక సంబంధాలు దెబ్బతిన్నాయని, విభజన తర్వాత పరిపాలనా సమస్యలు పెరిగాయని స్థానికులు చెప్తున్నారు.
ఈ అంశంపై ప్రత్యేక దృష్టి
ఈ నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలు, రాజకీయ నేతల విజ్ఞప్తుల నేపథ్యంలో 26 జిల్లాలను 32 జిల్లాలు చేసేందుకు ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రధానంగా ఆరు కొత్త జిల్లాల (New Districts) ఏర్పాటుపై ఉపసంఘం ముఖ్యమంత్రి (CM Chandrababu) కి నివేదించనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఉపసంఘం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా, అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలతో మరో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. సచివాలయం, అసెంబ్లీ ఇక్కడే ఉండటం, భవిష్యత్తులో పరిపాలనా కార్యకలాపాలు, ప్రోటోకాల్ విధులు పెరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు నాలుగు విలీన మండలాలతో రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై కూడా సీఎం వద్ద చర్చ జరగనుంది. రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు 187 కి.మీ. దూరంలో ఉండటంతో ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది.
రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు
అలానే ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాలతో పలాస కేంద్రంగా కొత్త జిల్లా ప్రతిపాదనలో ఉంది. ఇక గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో కలిపి గూడురు జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా ప్రతిపాదనలో ఉంది.
అలానే మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలతో మదనపల్లి కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటుకు ఉప సంఘం (Subcommittee) ప్రతిపాదించినట్లు సమాచారం.కొత్త జిల్లాలతో పాటు అద్దంకి, మడకశిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
అశాస్త్రీయ విభజనలను సరిదిద్దే అంశం
ఒక నియోజకవర్గం రెండు, మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉండటంతో తలెత్తుతున్న పరిపాలనా ఇబ్బందులను తొలగించేందుకు ఒకే నియోజకవర్గ పరిధిలోకి తెచ్చేలా మార్పులు చేయనున్నారు. ఆదోని వంటి పెద్ద మండలాలను విభజించాలనే వినతులపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని అశాస్త్రీయ విభజనలను సరిదిద్దే అంశంపైనా దృష్టి సారించారు. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా (Nellore District) లో కొనసాగించాలా లేక ప్రకాశం జిల్లాలో కలపాలా అనే అంశంపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: