Nara Lokesh : తెలుగుదేశం పార్టీలో నాయకత్వంపై ఎలాంటి అయోమయం అవసరం లేదని, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే ఏకైక నాయకుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. “చంద్రబాబు మన నాయకుడు. నాతో సహా మిగతా వారంతా పార్టీ సైనికులమే. నేనూ టీడీపీకి ఒక సైనికుడినే” అని ఆయన ఉద్ఘాటించారు.
ఉండవల్లిలోని తన నివాసంలో నూతనంగా నియమితులైన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జోనల్ కోఆర్డినేటర్లతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, క్రమశిక్షణ, నాయకుల బాధ్యతలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి చరిత్రను (Nara Lokesh) తిరగరాయాల్సిన బాధ్యత అందరిపై ఉందని లోకేశ్ అన్నారు. 1999 తర్వాత మళ్లీ వరుసగా రెండోసారి గెలిచే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం కావాలని చెప్పారు.
నేతల పనితీరును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని, ఇది రాష్ట్ర కమిటీ వరకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. నిర్ణయాల్లో తప్పులు జరిగినా వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలని సూచించారు.
పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అమలు చేయాలని, ‘మై టీడీపీ’ యాప్ ద్వారా వచ్చే సూచనలను పాటించాలన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను పార్టీ గుర్తించి గౌరవిస్తుందని భరోసా ఇచ్చారు.

కూటమి పార్టీలతో సమన్వయం మరింత బలోపేతం చేయాలని, కనీసం 15 ఏళ్ల పాటు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని లోకేశ్ పేర్కొన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: