చంద్రబాబును కలిసిన నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా మాజీ మంత్రిగా పనిచేసిన నాగం జనార్థన్ రెడ్డి అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.అనేక సంవత్సరాల తర్వాత కలిసిన నాగంను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.”ఎలా ఉన్నారు నాగం గారూ? ఆరోగ్యం బాగుందా చాలా కాలమైంది కలిసింది” అంటూ ఆప్యాయంగా పలకరించారు.నాగం కుటుంబం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.అలాగే పిల్లలు ఏం చేస్తున్నారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని సూచించారు.ఓబులాపురం మైనింగ్ వివాదంపై ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు తీవ్ర ఉద్యమం చేశారు.అప్పట్లో తెలుగుదేశం నేతలపై కేసులు నమోదయ్యాయి. వాటిలో నాగం జనార్థన్ రెడ్డి పేరు కూడా ఉంది. ఈ కేసుల విచారణలో భాగంగా గత గురువారం విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.

అయితే ఈ కేసులను ఎట్టకేలకు కోర్టు కొట్టివేయడం చంద్రబాబు హర్షించారన్నారు.ఈ సందర్భంగా నాగం జనార్థన్ రెడ్డి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును కలిశారు. ఇద్దరూ పాత రాజకీయ జ్ఞాపకాలను తలచుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాటి ప్రజా ఉద్యమాలు, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కీలక సంఘటనలు గురించి చర్చించారు.”నాగం గారు ఫైర్ బ్రాండ్ లీడర్. పార్టీ ఆదేశిస్తే వెనుకంజ వేయకుండా ముందుండే వారు” అని చంద్రబాబు గుర్తుచేశారు.నాగం ఎమోషనల్‌గా వ్యవహరించే వారు, ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాటం చేసే వ్యక్తి అని అన్నారు.
ఈ సందర్భంగా నాగం జనార్థన్ రెడ్డి స్పందిస్తూ, “నాలుగవసారి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది” అని అన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలు సమగ్ర అభివృద్ధి సాధించాలని, ప్రజలు అన్ని రంగాల్లో విజయాలను అందుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.”తెలుగు ప్రజల భవిష్యత్తు బంగారు రోజులు రావాలన్నదే నా ఆకాంక్ష” అని అన్నారు.నాగం జనార్థన్ రెడ్డి చంద్రబాబు భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా కొత్త అనుబంధాలు ఏర్పడతాయా తెలుగుదేశం పార్టీలో ఆయన మళ్లీ కీలకంగా మారతారా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇదే సమయంలో చంద్రబాబు, నాగం మధ్య రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, పార్టీ వ్యూహాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది.పాత మిత్రులు చంద్రబాబు – నాగం జనార్థన్ రెడ్డి మధ్య జరిగిన ఈ స్నేహపూర్వక భేటీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.నాగం తిరిగి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా అనే చర్చలు కూడా ఊపందుకున్నాయి.