భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha), ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఓ కీలక లేఖ రాసారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన అనంతరం ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలు చట్ట విరుద్ధంగా చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయబడ్డాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు. భద్రాచలం రామాలయ ప్రాంతంలోని యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
రామాలయ భూములపై ఆక్రమణల ఆందోళన
కవిత లేఖలో మరో ముఖ్య అంశంగా భద్రాచలం శ్రీరాముల వారి భూముల పరిరక్షణను ప్రస్తావించారు. పురుషోత్తపట్నం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూములు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటంతో, రామాలయానికి చెందిన భూములపై అక్రమ కబ్జాలు కొనసాగుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆలయ అధికారులు భౌతిక దాడులకు గురవుతున్నారని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని మసకబార్చేలా ఉన్నాయని ఆమె హెచ్చరించారు.
ప్రజల ఆవేదన, మానవతా దృష్టితో నిర్ణయం తీసుకోండి
విలీనమైన ఐదు గ్రామాల్లో ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక సేవలకు నానా ఇబ్బందులు పడుతున్నారని కవిత లేఖలో తెలిపారు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సేవలు పొందాల్సిన పరిస్థితిలో ప్రజలు ఉన్నారని ఆమె వాపోయారు. భద్రాచలంలోని రాముల వారి ఆలయ పునాదులు మరియు అక్కడి ప్రజల ఆవేదనను గౌరవించి, మానవతా దృష్టితో తెలంగాణలో ఐదు గ్రామాల విలీనానికి చంద్రబాబు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, రాజకీయ లబ్దిని కాదని, రాముని భక్తులను కాపాడాలని ఆమె అభిప్రాయపడ్డారు.
Read Also : Adulterated Toddy: కల్తీ కల్లు ఘటనలో ఆరుగురికి చేరిన మృతుల సంఖ్య