ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు మరింత సులభతర సేవలు అందించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేదా మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగి, రకరకాల దస్తావేజులు తీసుకెళ్లి, ఎక్కువ సమయం ఆఫీస్ లో ఉండాల్సి వచ్చేది. ఆస్తి పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇక అలాంటి క్లిష్టతకు ముగింపు పలికేలా, ప్రభుత్వం టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చింది.ఈ మేరకు ప్రభుత్వం వాట్సప్ మనమిత్ర (WhatsApp Manamitra) ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రామ పంచాయతీల్లో స్మార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఆస్తి పన్ను, నీటి కుళాయి బిల్లులు, వ్యాపార లైసెన్స్ ఫీజులు వంటివి ఇకపై స్మార్ట్‌ఫోన్ నుంచే చెల్లించొచ్చు. దీనివల్ల చాలామందికి వారి సొంత ఊళ్లలోని ఆస్తుల పన్నులు చెల్లించడం సులభతరం అవుతుంది. అలాగే పంచాయతీల్లో జరిగే అవినీతిని కూడా అరికట్టవచ్చు అంటున్నారు.
మనమిత్ర సేవలకు లింక్ చేస్తున్నారు అధికారులు
రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ఇళ్లకు సంబంధించి చాలామంది యజమానులు వేరే వేరే చోట్ల ఉంటున్నారట. ఈ 13,326లో కూడా 15% మంది రాష్ట్రం బయట ఉంటున్నారని అంచనాలు ఉన్నాయి. వాట్సాప్ ద్వారా వారసత్వంగా వచ్చిన ఆస్తుల పన్నులు కట్టడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. ఆస్తి పన్నుకు సంబంధించిన వివరాలను వాట్సాప్ మనమిత్ర సేవలకు లింక్ చేస్తున్నారు అధికారులు. ఈ వాట్సాప్ సేవల (WhatsApp services) ద్వారా ఎక్కడి నుంచైనా సులువుగా పన్ను చెల్లించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సరికొత్త విధానంపై ట్రయల్ రన్ నిర్వహించారు.ఈ సేవల్ని అక్టోబరు నుంచి అన్ని పంచాయతీల్లో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది
వాట్సాప్ ద్వారా పన్నుల్ని చెల్లిస్తే పంచాయతీల్లో అక్రమాలు తగ్గుతాయి అంటున్నారు.ప్రతి ఏటా పంచాయతీల ద్వారా రూ.822.46 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. గతంలో కొన్ని సందర్భాల్లో కొందరు సిబ్బంది డబ్బులు వసూలు చేసి రికార్డుల్లో మాత్రం నమోదు చేయడం లేదు. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు గతేడాది ప్రభుత్వం ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా క్యూఆర్ కోడ్ (QR code) ను స్కాన్ చేసి డబ్బులు చెల్లించవచ్చు అంటున్నారు. ఈ విధానంతో 2024-25లో ఆస్తి పన్ను వసూళ్లు పెరిగాయంటున్నారు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా పన్నుల చెల్లింపు మరింత సులువుగా ఉంటుందని చెబుతున్నారు.
Read Also: Chandrababu : రేపు తూ.గో. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన