ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ప్రజలు ఇప్పటికే తేల్చేశారని, కానీ ఆయన ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం లేదని లోకేశ్ అన్నారు. జగన్ తాను కోరిన విధంగా మాట్లాడుతున్నారని, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం తెలియాలని హితవు పలికారు.
అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది జగన్
లోకేశ్ మాట్లాడుతూ.. అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది జగన్ అని ఎద్దేవా చేశారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలోనూ జగన్ అదే అహంకార ధోరణిని ప్రదర్శించారని, ఇప్పుడు కూడా ప్రజల తీర్పును గౌరవించకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చిన తర్వాత కూడా జగన్ అధికారం కోల్పోయిన విషయంలో నొచ్చుకుంటూ, రూల్స్ అతిక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల్లో బెంగళూరు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారని, తనపై ఉన్న కేసుల విచారణ నుంచి తప్పించుకోవడానికే ఈ ప్రయాణమని లోకేశ్ ఎద్దేవా చేశారు.

ప్రతిపక్ష హోదా ఒక చట్టపరమైన వ్యవహారం
చట్టాన్ని ఉల్లంఘించడం జగన్‌కు అలవాటైపోయిందని లోకేశ్ ఆరోపించారు. గతంలో కూడా ఆయన నియమాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పుడు కూడా అదే తీరు కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష హోదా ఒక చట్టపరమైన వ్యవహారమని, దాన్ని జగన్ ఎలా కావాలనుకుంటే అలా మార్చలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం తప్ప, అప్రజాస్వామికంగా వ్యవహరించలేమని మంత్రి వ్యాఖ్యానించారు.
వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణం
సమావేశాల్లో జగన్ పాల్గొనకపోవడం, ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఆయన మాటలన్నీ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలే తప్ప, నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, కానీ జగన్ అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విపక్షం కూడా బాధ్యతగా వ్యవహరించాలి కానీ, నియమాలు అతిక్రమించి అశిస్తిగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.