వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపింది. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ప్రకారం, క్వార్ట్జ్ మైనింగ్లో అనుమతుల్లా తవ్వకాలు, పేలుడు పదార్థాల వినియోగం వంటి అంశాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

పోలీసుల అరెస్ట్
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం ఆరోపణలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో కాకాణిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్నారు. పలుమార్లు విచారణకు పిలిచినా హాజరుకాని ఆయన, రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో చివరకు బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్‌లో నిన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ మద్దతుదారుల తీవ్ర విమర్శలు
ఈ అరెస్ట్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరీగ మురళి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అరెస్ట్‌లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి, ప్రతిపక్షంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాకాణి అరెస్ట్‌పై జిల్లా పోలీసులు అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై వైసీపీ వర్గాలు కలవరపడుతూ, ఇది పూర్తిగా ప్రతిపక్ష నాయకులను అణచివేయాలనే రాజకీయ యత్నంగా చూస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, పాలనలో అసలు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వకుండా, ప్రతిపక్ష నేతలపై నిఘా, అరెస్ట్‌లు చేసేందుకు చొరవ చూపుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.
Read also: Kakani Govardhan Reddy: నేడు కోర్టుకు మాజీ మంత్రి కాకాణి హాజరు