ఒకప్పుడు అత్యంత నమ్మకస్థుడిగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వేదిక పై ప్రత్యక్షంగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం ఇంతకంటే స్పష్టంగా బయటపడలేదు.

పాత మైత్రి.. నేడు విభేదాలు!
వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ల నుంచే విజయసాయిరెడ్డి అతనికి సన్నిహితంగా ఉన్నారు. జగన్ మీద ఉన్న నమ్మకంతో ఎన్నో న్యాయపరమైన అంశాల్లో ఆయనకు మద్దతుగా నిలిచారు. జగన్ అవినీతి కేసుల సమయంలో ఆయనే ప్రధానంగా లీగల్ టీమ్‌ను ముందుండి నడిపించారు. ఆ నమ్మకమే ఆయనకు రాజ్యసభ సీటు తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు అదే విజయసాయి, జగన్ పై నేరుగా విమర్శలు చేయడం పార్టీ చరిత్రలో ఒక పెద్ద మలుపుగా మారింది.
జగన్ వ్యాఖ్యలు:
ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడుతూ, విజయ సాయిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయ సాయిరెడ్డి అని జగన్ ఆరోపణలు చేశారు. ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా 3 ఏళ్లు పదవీ కాలం ఇంకా మిగిలి ఉండగా చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడని విమర్శించారు. అయితే తాజాగా జగన్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. జగన్ ను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. తన రాజీనామాతో ఏపీలో కూటమి ప్రభుత్వానికే లబ్ధి చేకూరుతుందని అన్నారు.
విజయసాయిరెడ్డి కౌంటర్:
జగన్ వ్యాఖ్యలకు స్పందిస్తూ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, నేను మారను.. నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. పదవి వచ్చాక నువ్వే మారిపోయావు. నేను ఎప్పడూ ఇలాగే ఉన్నాను. మూడు దశాబ్దాలుగా నాకు రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. నేను ప్రలోభాలకు లొంగను. ఎవరీకీ భయపడను అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి తన రాజీనామాను వ్యక్తిగత కారణాలతో తీసుకున్నట్లు ప్రకటించినా, ఆ సమయంలో అనేక రాజకీయ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన రాజీనామాతో ఎన్డీఏ-తెలుగుదేశం-జనసేన కూటమికి ఒక ఊపు వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది వైసీపీకి నష్టమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read also: Chandrababu Naidu: అమరావతిని రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు