2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు విపరీతంగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా, సూపర్-6 పథకాలను అమలు చేయడానికి పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20,000 అందించనున్నారు. విద్యార్థులకు విద్యను ప్రోత్సహించేలా “తల్లికి వందనం” పథకాన్ని ప్రవేశపెట్టారు, దీని కింద 1 నుండి 12వ తరగతుల వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి తల్లికి రూ.15,000 నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ వర్తించనుంది. స్కూళ్లు ప్రారంభం అయ్యే నాటికి ఈ నిధులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఆరోగ్య బీమా, ఉచిత విద్యుత్ – ప్రజలకు ఊరట
ఆరోగ్య సేవలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా సదుపాయం అందించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఈ పథకం కింద కార్పొరేట్ స్థాయి వైద్యం అందించనున్నారు. అలాగే, ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగించడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు చేనేత మగ్గాలపై ఆధారపడే కుటుంబాలకు 200 యూనిట్లు, మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కేటాయించారు. నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు.
నివాస నిర్మాణానికి కూడా ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయగా, టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చారు. ఎస్సీలకు అదనంగా రూ.50,000, ఎస్టీలకు రూ.75,000 నిధులుగా కేటాయించారు. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, చేపల వేట నిషేధ కాలంలో వారికి అందించే ఆర్థిక సహాయాన్ని రూ.10,000 నుండి రూ.20,000 కు పెంచారు. దీపం 2.0 పథకం కింద నిధులను కేటాయించడంతో పాటు, ఆదరణ పథకాన్ని పునఃప్రారంభించారు. సంక్షేమాన్ని ప్రాధాన్యమిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో సముచిత కేటాయింపులు చేసింది.