Gramine Home Foods scam : గ్రామీణ హోం ఫుడ్స్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను నెల్లూరు దర్గామిట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు దర్గామిట్ట సీఐ కళ్యాణ్ రాజు వివరాలు వెల్లడించారు.
నెల్లూరుకు చెందిన గొర్లె విజయ్ కుమార్, అన్నెపోగు మహేంద్ర కుమార్, సంక్రాంతి కళ్యాణ్ అనే ముగ్గురు కలిసి నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఆరు నెలల క్రితం “విహాన్ గ్రామీణ ఫుడ్స్ అండ్ బేవరేజెస్” అనే సంస్థను స్థాపించారు. పచ్చళ్ళు, పొడులు, పులిహోర రకాలు, చిరుతిండి పదార్థాలు, అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాలను సరఫరా చేస్తామని ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘గ్రామీణ (Gramine Home Foods scam) హోం ఫుడ్స్’ పేరుతో సుమారు 400కు పైగా ఫ్రాంచైజీల ఏర్పాటుకు ఆహ్వానించగా పలువురు ఆసక్తి చూపారు. ఒక్కో ఫ్రాంచైజీకి రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు నగదు వసూలు చేసి అనుమతులు ఇచ్చారు. ప్రారంభంలో ఒక నెల పాటు ఫ్రాంచైజీలకు ఆహార పదార్థాలను సక్రమంగా సరఫరా చేసిన నిందితులు, ఆ తర్వాత సరఫరా నిలిపివేశారు.
Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?
నగదు తీసుకున్నప్పటికీ సకాలంలో సరుకులు అందించకపోవడంతో ఫ్రాంచైజీల నుంచి ఒత్తిడి పెరిగింది. కొద్ది రోజుల పాటు నిందితులు ఏదో ఒక కారణం చెబుతూ కాలం గడిపారు. చివరికి మోసపోయిన ఫ్రాంచైజీల ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తు అనంతరం మంగళవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో రిమాండ్‌కు తరలించారు. ప్రాథమికంగా సుమారు రూ.40 లక్షల వరకు మోసం జరిగినట్లు ఫిర్యాదుల ద్వారా తెలుస్తున్నప్పటికీ, అసలు మోసపు మొత్తం రూ. కోట్లలో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: