తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి ప్రకటించడం సమాజంలో ఒక ముఖ్యమైన చర్చకు నాంది పలికింది. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమేకాదు, మనసమాజం, కుటుంబ వ్యవస్థ, విలువలు ఎటు దారి తీస్తున్నాయనే ప్రశ్నను కూడా మన ముందుంచింది. తల్లిదండ్రులను చూసుకోవడం అనేది ఎప్పటి నుంచో మన సంస్కృతిలో సహజంగా వస్తున్న ధర్మం. కానీ నేటికాలంలో, ఆ ధర్మాన్ని గుర్తు చేయడానికి ప్రభుత్వం చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం నిజంగా ఆలోచింపజేసే విషయం. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం, తెలంగాణలో పనిచేస్తున్న ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తన తల్లిదండ్రులను సరిగా చూసుకోక పోతే, అతని లేదా ఆమె జీతం నుండి 10నుండి 15శాతం వరకు కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇది మాటల హెచ్చరిక కాదు, దీనిని చట్టబద్ధంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతోంది. అంటే ఈ విషయం మీద ప్రభుత్వం ఎంత శ్రద్ధగా ఆలోచిస్తుందో దీని ద్వారా స్పష్టమవుతుంది. తల్లిదండ్రులను (Elderly parents)నిర్లక్ష్యం చేయడం ఒక వ్యక్తిగత సమస్యగా కాకుండా, ఒక సామాజిక సమస్యగా ప్రభుత్వం గుర్తిస్తోంది. మన దేశంలో ఇప్పటికే వృద్ధతల్లిదండ్రుల (Elderly parents) హక్కుల పరిరక్షణ కోసం కేంద్రప్రభుత్వం 2007లో ‘మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్అదర్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం, తల్లిదండ్రులు తమను తాము పోషిం చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, పిల్లలు వారికి ఆర్థిక సహా యం చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. అంతేకాకుండా, తల్లిదండ్రులు తమ పిల్లలు చూసుకుంటారనే నమ్మకంతో ఆస్తులను బదలాయించి, తర్వాత వారు నిర్లక్ష్యం చేస్తే, ఆ ఆస్తులను తిరిగి తమ పేరుపైకి తీసుకునే హక్కు కూడా ఈ చట్టం ఇస్తుంది. అయితే ఈ చట్టం అమలు కోసం వృద్ధులు కోర్టులు, ట్రిబ్యునల్స్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇది చాలా మందికి మానసికంగా, శారీరకంగా కష్టమైన ప్రక్రియ. తెలం గాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానం ఈ సమస్య కు ఒక భిన్నమైన పరిష్కారాన్ని చూపుతోంది. కోర్టులు, కేసులు, అలస్యం లేకుండా, నేరుగా ఉద్యోగి జీతం నుంచేడబ్బును తల్లిదండ్రులకు అందించడం ద్వారా వృద్ధులకు తక్షణ భద్రత కల్పించాలన్నది దీని లక్ష్యం. ఇది తల్లిదండ్రుల హక్కులను మరింత బలంగా పరిరక్షించే చర్యగా చూడ వచ్చు. కానీ అదే సమయంలో, ఇది వ్యక్తిగత జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ఎంతవరకు అనుమతించాలి అన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది.
Read Also : http://Ajit pawar: పైలట్‌కు మంచి అనుభవం.. అయిన ప్రమాదం

మాతృ దేవోభవ, పితృ దేవో భవ’
ఒక కుటుంబంలో జరిగే వివా దాలను, సంబంధాలను నేరుగా ప్రభుత్వం నియంత్రించడం సరైందా అనే చర్చ తప్పనిసరిగా జరుగుతుంది. భారతదేశం లో వృద్ధుల సంక్షేమం విషయంలో కేరళరాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసింది. స్టేట్ ఎల్డరీ కమిషన్ యాక్ట్ 2025′ ద్వారా కేరళలో ఒక ప్రత్యేకమైన చట్టబద్ధమైన కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ వృద్ధుల హక్కులు, సంక్షే మం, సమస్యలపై ప్రత్యేకంగా పనిచేస్తుంది. భారతదేశంలో వృద్ధుల కోసం ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇది వృద్ధుల సమస్యలను ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతతో చూస్తుందో చెప్పే ఉదాహరణ. అంతర్జాతీ యంగా కూడా అనేక దేశాలు తల్లిదండ్రుల సంరక్షణపై చట్టాలు తీసుకొచ్చాయి. సింగపూర్లో ‘మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ యాక్ట్ ఉంది. ఈ చట్టం ప్రకారం, 60 ఏళ్లు దాటిన తల్లిదండ్రులు తమను తాము పోషంచుకోలేని స్థితిలో ఉంటే, వారి పిల్లలు వారికి ఆర్థిక సహాయం చేయాల్సిందే. అదే విధంగా చైనాలో ‘ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎల్డర్ పీపుల్ అనే చట్టం ఉంది. దీనిలో తల్లిదండ్రులకు ఆహారం, నివాసం, వైద్యం వంటి అవసరా లను పిల్లలు అందించాల్సిన బాధ్యతను స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఈ సమస్య భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల నిర్లక్ష్యం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులను దైవంతో సమానంగా భావిస్తాం. ‘మాతృ దేవోభవ, పితృ దేవో భవ’ అన్న మాటలు మన చిన్నప్పటి నుంచే మన చెవుల్లో నినదిస్తాయి. శ్రవణ కుమారుడి కథ మనకు తల్లి దండ్రుల పట్ల చూపాల్సిన భక్తి, సేవ ఎంత గొప్పదో గుర్తు చేస్తుంది. తన అంధులైన తల్లిదండ్రులను కావడిలో పెట్టు కుని తీర్థయాత్రకు తీసుకెళ్లిన శ్రవణ కుమారుడు, తన ప్రాణాలు పోయే క్షణంలో కూడా తల్లిదండ్రుల దాహం గురించి మాత్రమే ఆలోచించాడు. అలాంటి కథలు మన సంస్కృతిలో తల్లిదండ్రుల సేవ ఎంతపవిత్రమోచెబుతాయి.

అస్తిత్వానికి మూలం
నేటి సమాజంలో పరిస్థితి చాలా మారిపోయింది. పట్ట ణీకరణ, ఉద్యోగాల కోసం వలసలు, ఆర్థిక ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి కుటుంబసంబంధాలను బలహీనపరుస్తున్నాయి. చాలా మంది యువత తమ సొంత పిల్లల భవిష్యత్తు గురించి ఎంతగా ఆలోచిస్తారో, తమ తల్లిదండ్రులు వృద్ధాప్యంగురించి అంతగా అలోచించడం లేదు. కొందరు పిల్లలు తల్లిదండ్రుల ను తమ జీవితంలో ఒక భారంగా చూడడం బాధాకరం. ఆహారం, మందులు, వైద్యసేవలు వంటి కనీస అవసరాలు కూడా ఇవ్వడానికి ఇష్టపడని సందర్భాలు మన చుట్టూ కని పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకు రాబోయే చట్టం ఒక హెచ్చరికలా కూడా పనిచేయవచ్చు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, కేవలం నైతికంగా తప్పు చేయడమే కాకుండా, ఆర్థికంగా కూడా దాని ఫలితాలుఉంటా యని ఇది చెప్పుతుంది. ఇది కొంతమందిలో అయినా మార్పు తీసుకువచ్చే అవకాశం ఉంది. కనీసం తల్లిదండ్రులకు ఒక స్థిరమైన ఆదాయ మార్గం ఏర్పడుతుంది. వారు తమ పిల్లల దయాదాక్షిణ్యాల మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే ఈచట్టాన్ని అమలు చేసే సమయంలో చాలా జాగ్రత్త అవసరం. ప్రతి కుటుంబ సమస్య ఒకేలా ఉండదు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే పిల్లలను వేధించే పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు నిజంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండవచ్చు. కాబట్టి ఈ చట్టం గుడ్డిగా అమలవ్వకుండా, ప్రతి కేసును సున్నితంగా పరిశీలించే వ్యవస్థ అవసరం. అందుకే కమిటీ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైన విషయం. సరైన మార్గదర్శకాలు, రక్షణ లు లేకపోతే, ఈ చట్టం కొత్త అన్యాయాలకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులను చూసుకోవడం చట్టం వల్ల కాదు, మన మనసువల్ల జరగాలి. కానీ మన మనసు మారకపోతే, సమాజాన్ని కాపాడటానికి చట్టాలు రావాలి. ఒక మొక్క మనకు నీడను, పండ్లను ఇస్తుంది. కానీ ఆమొక్క వేర్లు ఎండిపోతే, చెట్టుమొత్తం కూలిపోతుంది. అలాగే మనల్ని పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులు మన జీవితానికి వేర్లులాంటి వారు. వారిని నిర్లక్ష్యంచేస్తే, మన జీవితానికి కూడా పునాది ఉండదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోయే ఈ చట్టం మనందరికీ ఒక సం దేశంఇస్తోంది. తల్లిదండ్రులను చూసు కోవడం మనపైఎవరో మోపిన బాధ్యతకాదు, అది మన అస్తిత్వానికి మూలం. ఇప్పటికైనా మనం మన విలువలను గుర్తుచేసుకొని, తల్లిదండ్రు లను గౌరవించి, వారికి అవసరమైన భద్రతను అందించాలి.
– పద్మ పుత్ర మల్లికార్జున
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: