బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ APSDMA ప్రకారం, ఈ తుఫాను కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిందని ప్రకటించింది. కాకినాడ సమీపంలో ఇది తీవ్రమైన తుఫాను శక్తిని సంతరించుకొని తీరం మీదుగా దూసుకుపోతోందని వివరించింది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు సుమారు మూడు నుండి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా మారి, సమీప గ్రామాలు భారీ గాలుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
News Telugu: PM Kisan: రైతులకు శుభవార్త మీ ఖాతాల్లోకి మరో రూ.2 వేలు: మోదీ
APSDMA అధికారులు తుఫాను వేగం గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపారు. గాలి బీభత్సం కారణంగా చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజానగరం, తుని, ఉప్పాడ, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, కొన్ని చోట్ల జలమయ ప్రదేశాలు ఏర్పడ్డాయని నివేదికలు చెబుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, తీరప్రాంత ప్రజలను ఆశ్రయశిబిరాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మండలాలకు అప్రమత్తత సూచనలు జారీ చేసింది.

తీరప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని APSDMA విజ్ఞప్తి చేసింది. గాలి, వర్షాల తీవ్రత దృష్ట్యా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. తీర ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు విభాగాలు సన్నద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. వాతావరణశాఖ హెచ్చరికలు ఇంకా రెండు రోజులపాటు ప్రభావం కొనసాగవచ్చని సూచిస్తున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/