ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి(Coconut )కి ఎప్పుడూ లేని రీతిలో ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మార్కెట్‌లో కొబ్బరి ధర రూ.22 వేల నుంచి రూ.23 వేలు వరకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.12 వేల వరకు ఉండేది. ఈసారి దాదాపు పది వేలు వరకు అధిక ధర రావడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరుగుదల
కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, తక్కువ దిగుబడి కారణంగా మార్కెట్‌లో కొబ్బరి ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కొబ్బరికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఎగుమతుల మార్కెట్‌కి సరఫరా కోసం కూడా ఆంధ్ర కొబ్బరిని ఆశ్రయిస్తున్నారు. దీంతో రైతులకు మంచి లాభాలు లభిస్తున్నాయి.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో విస్తృత సాగు
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కొబ్బరి సాగు కేంద్రాలుగా నిలిచాయి. ఈ రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 2 లక్షల ఎకరాలపైగా కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. వాతావరణ అనుకూలత, నీటి లభ్యత కారణంగా ఇక్కడి కొబ్బరి నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో రైతులు ఇప్పటి నుంచే కాయలు నిల్వ చేసే చర్యలు తీసుకుంటున్నారు.
Read Also : electric cycle : సొంతంగా ఈ-సైకిల్ తయారుచేసిన విద్యార్థి