స్వచ్ఛ భారత్ వంటి జాతీయ కార్యక్రమాల ద్వారా దేశం బహిరంగ మల విసర్జన రహితస్థితిని సాధిం చడంలో గణనీయమైన ప్రగతి సాధించింది. అయితే మరుగుదొడ్ల నిర్మాణం వలన కలిగే అపారమైన ప్రయోజనాలను పూర్తిగా అందుకోవాలంటే, నిర్మాణానంతరం ఎదురయ్యే నిర్వహణ, వినియోగ అలవాట్ల సవాళ్లను కూడా అదే స్థాయిలో అర్థం చేసుకోవాలి. పరిశుభ్రత (Cleanliness) అనేది కేవలం ఒక సౌకర్యం కాదు. ఇది దేశ పౌరుల ఆరోగ్యం, గౌరవం ఆర్థిక అభివృద్ధికి మూల స్తంభం. మరుగుదొడ్ల కల్పన అనేది కేవలం ఒక పౌర సదుపాయంగా కాకుండా బహుముఖ ప్రయోజనాలు అందించే సామాజిక పెట్టుబడిగా చూడాలి. మరుగుదొడ్ల కల్పన వలన కలిగిన అతి ముఖ్యమైన ప్రయోజనం మహిళల భద్రత, గౌరవం మెరుగుపడటం. బహిరంగ మల విసర్జనకు వెళ్లవలసి వచ్చినప్పుడు ముఖ్యంగా చీకటి పడిన తర్వాత, మహిళలు లైంగిక వేధింపులు, ప్రమాదాలు,మానసిక ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొనేవారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లభ్యత వలన, మహి ళలు ఈ రకమైన సామాజిక భయం నుండి విముక్తి పొందారు. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని పెంచింది. సమాజం లో వారి భద్రతా స్థాయిని బలోపేతం చేసింది. యుక్త వయస్సు బాలికలు సరైన మరుగుదొడ్ల సదుపాయం కారణంగా పాఠశాలలకు హాజరు కావడం పెరిగింది. పరిశుభ్ర మైన మరుగుదొడ్ల వినియోగం వలన అతి ముఖ్యంగా ప్రజా ఆరోగ్యం మెరుగుపడుతుంది. బహిరంగ మల విసర్జన పద్ధతులు నీరు, ఆహారం, నేలను కలుషితం చేస్తాయి. దీని వలన పిల్లలు, వృద్ధులలో డయేరియా, టైఫాయిడ్, కలరా వంటి తీవ్రమైన అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. మరుగుదొడ్ల వినియోగం, ఈ వ్యాధులకు కారణమయ్యే వ్యాధి కారకాలు పర్యావరణంలోకి చేరకుండా అడ్డుకుంటుం ది. ఈ వ్యాధుల నియంత్రణ వలన అటు ప్రభుత్వ
ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గడంతో పాటు, ఇటు పేద కుటుంబాలు చికిత్స కోసం ఖర్చుపెట్టవలసిన ఆదాయ నష్టం తగ్గుతుంది. పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టిస్తుంది. ప్రజలు తరచుగా అనారోగ్యంబారిన పడకుండా ఉన్నప్పుడు, వారి ఉత్పాదకత పెరుగుతుంది. అనారోగ్యంతో సెలవులు తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా ఉద్యోగులు, కూలీలు నిరంతరంగా పనిచేయగలుగుతారు.
Read Also : Amaravati: రాజధాని వరద ముంపు నివారణకు రెండో పంపింగ్ స్టేషన్కు టెండర్లు

తగ్గినా డయేరియా మరణాలు
ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం, పారిశుద్ధం, పరిశుభ్రత (Cleanliness)లో పెట్టుబడి పెట్టడం వలన ఆరోగ్య ఖర్చులు తగ్గి, జాతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ విధంగా, మరుగుదొడ్ల కల్పన దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)కి పరోక్షంగా దోహదం చేస్తుంది. డబ్ల్యూవాచ్ నివేదిక ప్రకా రం 2014తో పోలిస్తే 2019లో దేశంలో మూడు లక్షల డయేరియా మరణాలు నివారించబడ్డాయి. ఆరోగ్య ఖర్చులు తగ్గినందున సగటున ఒకకుటుంబం సాలీనా 50,000 రూపాయలు ఆదా చేసింది. భూగర్భ జలాల కాలుష్యం 12.70 రెట్లు తగ్గాయి. ఆగస్టు 2017 లో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఒక స్వతంత్ర సర్వే, మొత్తం జాతీయ గ్రామీణ గృహ పారిశుద్ధ్య కవరేజ్ 62.5 కి, మరుగుదొడ్ల వినియోగం 91.3కు పెరిగిందని నివేదించింది. గ్రామీణ ప్రాంతాల్లో 99శాతం గృహాలు, 100శాతం మరుగు దొడ్ల వినియోగంతో హరియాణా అగ్రస్థానంలో నిలిచింది. మరుగుదొడ్డి లేని వారిసంఖ్య 55 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గిందని యునిసెఫ్ తెలిపింది. మరుగుదొడ్డిని 96 శాతం మంది ఉపయోగిస్తున్నారని ప్రపంచ బ్యాంకు నివేదించింది. మరుగుదొడ్ల నిర్మాణంలో విజయం సాధించినప్పటికీ ప్రయోజనాలను పూర్తిగా అందుకోవాలంటే అనేక వ్యవస్థా పరమైన, సామాజిక సవాళ్లను అధిగమించాలి. మరుగుదొడ్ల నిర్మాణానంతరం ఎదురయ్యే అతిపెద్ద సమస్య సరైన నిర్వ హణ, నీటి లభ్యత లేకపోవడం. ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాలలో లేదా నీటికొరత ఉన్న ప్రాంతాలలో, మరుగుదొడ్లు నిర్మించినా, వాటిని శుభ్రపరచడానికి తగినంత నీరు ఉండక పోవడం వలన అవి ఉపయోగించడానికి వీలు లేకుండా పోతున్నాయి. మరుగుదొడ్లు మురికిగా ఉంటే, ప్రజలు తిరిగి బహిరంగ మల విసర్జనకు మొగ్గుచూపుతారు. మురుగునీటి నిర్వహణ వ్యవస్థ సరిగా లేకపోవడం వలన, ఆ వ్యర్థాలు తిరిగి పర్యావరణంలోకి చేరి, భూగర్భ జలాలు కలుషితమ వుతున్నాయి. సాంకేతిక పరిష్కారం కంటే ప్రవర్తనా మార్పు తీసుకురావడం చాలా కష్టం. తరతరాలుగా బహిరంగ మల విసర్జనకు అలవాటు పడిన వర్గాలలో మరుగుదొడ్లను ఉపయోగించడం అనేది ఆమోదయోగ్యం కాని సామాజిక, సాంస్కృతిక అలవాటుగా మారింది.
సామాజిక చైతన్యం అవసరం
చాలా మంది బహిరం గ మల విసర్జనను ‘స్వచ్ఛత’గా భావిస్తారు, ఎందుకంటే మరుగుదొడ్లు
‘మురికిని’ ఒకే చోట నిల్వ చేస్తాయి. ఈ మానసిక ప్రతిఘటనను అధిగమించడానికి నిరంతర సామా జిక చైతన్యం అవసరం. పట్టణ ప్రాంతాలలో, ముఖ్యంగా రద్దీగా ఉండే మురికివాడల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిం చడానికి స్థలం లభించకపోవడం ప్రధాన సమస్య. ఇక్కడ సామాజిక మరుగుదొడ్లు అవసరం. కానీ ఈ సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం నాణ్యత, నిర్వహణ లోపాలు కార ణంగా అవి తరచుగా అపరిశుభ్రంగా, పనికిరాకుండా పోతు న్నాయి. పట్టణ ప్రణాళికలో పారిశుద్ధ్య వ్యవస్థకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం వలన, సమస్య మరింత జటి లమవుతోంది. మరుగుదొడ్ల ఉపయోగాలు పూర్తిగా అందు బాటులోకి రావాలంటే ప్రభుత్వం, సమాజం ప్రజలు కలిసి పనిచేయాలి. ప్రభుత్వం నీటి సంరక్షణ మురుగునీటి శుద్ధిపై దృష్టి సారించాలి. ప్రతి ఇంటి మరుగుదొడ్డిని ఒక చిన్నవ్యర్థ శుద్ధి కేంద్రంతో అనుసంధానం చేసే స్థిరమైన లేదా సామాజికసంస్థలకు టెక్నాలజీని ప్రోత్సహించాలి. సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ బాధ్య తను పారదర్శకతతో కూడిన స్థానిక మహిళాస్వయం సహా యక అప్పగించి, వారికి ఆర్థిక మద్దతు అందించాలి. విద్య, ఆరోగ్య కార్యకర్తల ద్వారా చైతన్యం కలిగించాలి. పాఠశాలల్లో విద్యార్థులకు, ఆశా కార్య కర్తల ద్వారా గ్రామాలలో మహిళలకు పరిశుభ్రత తాలూకా శాస్త్రీయ, ఆర్థిక ప్రయోజనాలపై చైతన్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలి. బహిరంగ మల విసర్జన వలన కలిగే ప్రమాదాలు, మరుగుదొడ్లు వాడటం వలన కలిగే సామాజిక, ఆరోగ్య ప్రయోజనాలను స్పష్టంగా వివరించాలి. ప్రవర్తనా మార్పు అనేది ఒక రాత్రిలో జరిగేది కాదు, దీనికి దీర్ఘకాలిక కృషి అవసరం. ప్రపంచ మరుగుదొడ్డి దినోత్స వం సందర్భంగా భారతదేశం మరుగుదొడ్ల నిర్మాణాన్ని విజ యవంతంగా పూర్తి చేసినప్పటికీ, వినియోగ అలవాట్లు, నిర్వ హణ అనే రెండు ముఖ్యమైన సవాళ్లను అధిగమించవలసి ఉంది. పరిశుభ్రతను ఒక సామాజిక బాధ్యతగా భావించి, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు కలిసి పనిచేసిన ప్పుడే ఈ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో సమాజానికి అందుతాయి. ఈ నిరంతర సంకల్పం ద్వారానే భారతదేశం ఆరోగ్యవంతమైన, సుస్థిరమైన, గౌరవప్రదమైన భవిష్యత్తు వైపు సాగగలదు. పరిశుభ్రతలో విజయం సాధించడంఅనేది దేశ సమగ్రాభివృద్ధికి అనివార్యమైన తొలి మెట్టు.
– డి.జయరాం
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: