జిల్లా పొదిలిలో జూన్ 11న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan) పర్యటించిన సందర్భంగా ఓ దృశ్యం పెద్దగా చర్చనీయాంశమైంది. ఆయన పర్యటన సందర్భంగా రోడ్డు పక్కన నిరసన తెలుపుతున్న మహిళలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. దాంతోపాటు పోలీసులు విచారణ చేపట్టి ఈ ఘటనకు సంబంధించి 15 మందిని అరెస్టు చేశారు. ఈ చర్యల నేపథ్యంలో వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు.
స్టేషన్ లో చెవిరెడ్డి ఆగ్రహం
ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ప్రముఖ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy) నేరుగా పొదిలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నిందితులను కలవాలని ప్రయత్నించారు. అయితే పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితులను కలవడానికి అనుమతి లేదని సీఐ వెంకటేశ్వర్లు చెప్పడంతో చెవిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసు అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. నేరుగా స్టేషన్‌లో ధర్నా చేస్తానంటూ హెచ్చరించారు.
డీఎస్పీ చొరవతో తగ్గిన ఉద్రిక్తత
చెవిరెడ్డి–సీఐ మధ్య మాటల తూటాలు పెరిగిపోవడంతో ఒక దశలో సీఐ వెంకటేశ్వర్లు పైకి దూసుకువెళ్లారు. ఈ పరిస్థితిని గుర్తించిన డీఎస్పీ లక్ష్మీనారాయణ తక్షణమే రంగప్రవేశం చేసి చెవిరెడ్డిని అడ్డుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పోలీసులు తమ విధి నిర్వహణలో న్యాయంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, రాజకీయ ఒత్తిళ్లకు లోనవకూడదనే చర్చ కూడా జనం మధ్య సాగుతోంది.
Read Also : Israel : తొమ్మిది మంది ఇరానీ అణు శాస్త్రవేత్తల హతం