ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా సాధనను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో ముందుకు సాగుతోంది. యోగాను ఒక సామూహిక ఉద్యమంగా తీర్చిదిద్దే దిశగా ‘యోగాంధ్ర’ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra babu) నేతృత్వంలో ఈ కార్యక్రమానికి రూపు వచ్చింది. ఆయన నిన్న సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, యోగాంధ్రను ఒక ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే ఆరోగ్యమే ప్రాధాన్యం. అందుకే యోగాను విస్తృతంగా ప్రచారం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. యోగా వల్ల శారీరకమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. విద్యార్థులకు యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, ప్రతి పాఠశాలలో వారానికి రెండు యోగా క్లాసులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం (Chandra babu) తెలిపారు. ఇందులో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి యోగా తప్పనిసరిగా చేయించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.

విశాఖ వేదికగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధం
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా సాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.29 లక్షల ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 2 కోట్ల మంది ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. ఒక్కే ప్రదేశంలో 3 లక్షల మంది యోగా చేయడం ద్వారా ఒక గిన్నిస్ రికార్డు, ఒకేసారి 2 కోట్ల మంది యోగా(Yoga) చేయడం ద్వారా మరో ప్రపంచ రికార్డు (World record) సాధించనున్నట్టు సీఎం ప్రకటించారు. మొత్తం 22 రికార్డులను బ్రేక్ చేయడం ఈ యోగాంధ్ర లక్ష్యం కావడం విశేషం.
తరతరాలకు ఆధ్యాత్మిక వారసత్వం: యోగా విద్యా సంస్కరణల్లోకి
ప్రభుత్వం యోగా విద్యను ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టే దిశగా ముందడుగు వేసింది. భవిష్యత్తులో ప్రత్యేక యోగా కోర్సులు అందించేందుకు యోగా-నేచురోపతి డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. అంతేకాదు, లాభాపేక్ష లేని యోగా సంస్థ ఏర్పాటు చేసి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ప్రచారం కొనసాగిస్తామని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ యోగా పరిషత్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
టెక్నాలజీతో సంయోగం: ‘యోగిఫై’ మ్యాట్‌కు సీఎం ప్రశంసలు
ఈ సందర్భంగా ‘యోగిఫై’ మ్యాట్‌ను రూపొందించిన సోమిశెట్టి మురళీధర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి ఈ మ్యాట్‌ను తయారు చేయడం అద్భుతమని కొనియాడారు. మ్యాట్ తయారీ విధానం, అది పనిచేసే తీరును మురళీధర్ సీఎంకు వివరించారు. ప్రత్యేక యాప్ ద్వారా పనిచేసే ఈ మ్యాట్, ఆసనాలు వేసే సమయంలో మార్గదర్శనం చేస్తుందని, ఒకసారి చార్జింగ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు. ఈ వివరాలను సీఎం ఆసక్తిగా ఆలకించి, మ్యాట్ గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఆవిష్కరణలు ఎవరు చేసినా తాము ప్రచారం కల్పిస్తామని, అయితే మార్కెటింగ్ మాత్రం వాళ్లే చేసుకోవాలని సీఎం నవ్వుతూ అన్నారు.
యోగాకు మత సంబంధం లేదు – సైన్స్ ఆధారిత విధానం
యోగాను మతంతో ముడిపెట్టడం సరికాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ఇతర మతస్తులు కూడా యోగా ఆచరిస్తున్నారని తెలిపారు. యోగా, ఉపవాసం వంటి సంప్రదాయ పద్ధతులు శాస్త్రీయంగా నిఖార్సైనవేనని పేర్కొన్నారు. చిన్నతనంలో తిరుపతిలో శ్రీవారి సేవలో పాల్గొని, ఉపవాసం ఆచరించిన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.
Read also: Nara Lokesh: జగన్ పాలనలో తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవిస్తారు : మంత్రి నారా లోకేష్