ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (ap assembly session) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు 10 రోజులపాటు కొనసాగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా, పరిపాలనా పరంగా కీలకంగా ఉండనున్నాయి. పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఏపీ మోటార్ వెహికల్ ట్యాక్స్, ఎస్సీ వర్గీకరణ, మున్సిపల్ చట్టాల సవరణతో పాటు మొత్తం 6 ఆర్డినెన్సులను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం. దీంతో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు చట్టపరమైన బలం చేకూరనుంది.
ఇక టిడిపి ఈ సమావేశాల్లో చర్చకు 20 ప్రధాన అంశాలను ప్రతిపాదించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ‘సూపర్-6’ హామీల అమలు, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించేందుకు టిడిపి సిద్ధమవుతుండగా, సభలో వాతావరణం ఉత్కంఠభరితంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు, ప్రతిపక్ష హోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాము ప్రతిపక్ష హోదా పొందితేనే సభ కార్యకలాపాల్లో పాల్గొంటామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సభ సజావుగా నడుస్తుందా? లేక ప్రతిపక్ష హోదా అంశం చుట్టూ చర్చలు రగులుతాయా? అనేది చూడాలి. ఏదేమైనా, ఈ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి గాలులను రేపడం ఖాయం.