AP Municipal Election Results 2026 : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలు జరిగిన 13 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా, ప్రాథమిక ట్రెండ్స్‌లో కూటమి పార్టీలు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 8 కార్పొరేషన్లలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇందులో ఆరు కార్పొరేషన్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, మరో రెండు చోట్ల జనసేన అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, కడప, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ తదితర నగరాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఇవి కేవలం ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ మాత్రమే కావడంతో తుది ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
Read Also : విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీ లో భారీ అగ్ని ప్రమాదం

తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కౌంటింగ్‌పై SEC సమీక్ష.. తుది నిర్ణయంపై ఉత్కంఠ!
మరోవైపు తుఫాన్ ప్రభావిత ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తోంది. వాతావరణ పరిస్థితులు, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మరో గంటపాటు పరిస్థితులను నిశితంగా గమనించిన అనంతరం ఆయా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును కొనసాగించాలా? లేక తాత్కాలికంగా వాయిదా వేయాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఈ రెండు జిల్లాల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లలో జరుగుతున్న ఈ కౌంటింగ్‌లో చివరకు ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందనే దానిపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఆధిక్యాలు తుది ఫలితాలుగా మారుతాయా? అన్నది కౌంటింగ్ పూర్తయ్యాకే స్పష్టత రానుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :