ఆంధ్రప్రదేశ్‌కు నైరుతి రుతుపవనాల విషయంలో భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త అందించింది. సాధారణంగా జూన్ 4న రాష్ట్రంలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి నాలుగు నుంచి ఐదు రోజులు ముందే వచ్చే అవకాశముందని అంచనా వేసింది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కన్యాకుమారి ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో రుతుపవనాల విస్తరణ శీఘ్రంగా జరుగుతుందని వెల్లడించింది.
కేరళలో రాక
రుతుపవనాల అధికారిక ప్రవేశం సాధారణంగా కేరళ(Kerala)లో రాకతో పరిగణించబడుతుంది. కేరళను సాధారణంగా జూన్ 1న తాకే నైరుతి రుతుపవనాలు, ఈ సంవత్సరం మే 27నే ప్రవేశించవచ్చని IMD అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మే చివరినే వానల మోసాలు మొదలయ్యే అవకాశముంది. ఏదేమైనా, తుపానులు లేదా ఇతర వాతావరణ మార్పులు అడ్డుపడకపోతే ఈ అంచనా నిజమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం మారే అవకాశం
ఈ నేపథ్యంలో, రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీసే సూచనలు ఉన్నాయని సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మొత్తం మీద, ఈ ఏడాది వర్షాకాలం ముందే మొదలై రాష్ట్రానికి మంచి వర్షపాతం అందించే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also : Earthquake in Turkey : తుర్కియే దేశంలో భూకంపం